రాహుల్ గాంధీకి భారీ ఊరట.. పరువు నష్టం కేసులో దోషిగా తేల్చడంపై సుప్రీం స్టే
పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది..
పరువునష్టం కేసులో ఆయన్ను దోషిగా తేల్చడంపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. గరిష్ఠ శిక్ష విధింపునకు ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దిగువ కోర్టులు పత్రాల సంఖ్య చూశాయేగానీ సరైన కారణాలు చూపలేదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో.. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి.. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌ను అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఈ కేసును విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు దిగువ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ శిక్ష కేవలం రాహుల్ గాంధీనే కాకుండా.. ఆయనను ఎన్నుకున్న ప్రజలను సైతం ప్రభావితం చేస్తోందని సుప్రీం అభిప్రాయపడింది.