మంకీపాక్స్ ఎక్కువాగా వీరికే సోకుతుంది, వీరితో జాగ్రత్త..!! ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి..!!!

కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనే లేదు..
అప్పుడే మంకీపాక్స్ రూపంలో మరో కొత్త వ్యాధి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. కొద్ది నెలలుగా వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి ఇప్పటివరకూ 78 దేశాలకు పాకింది. ఈ దేశాల్లో ఇప్పటివరకూ 18 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులో యూరోప్‌లోనే నమోదయ్యాయి. అందులోనూ 90 శాతం కేసులు గే లేదా బైసెక్సువల్ పురుషుల్లోనే నమోదవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గే, బైసెక్సువల్ కమ్యూనిటీకి ఒక కీలక విజ్ఞప్తి చేసింది.

గే, బైసెక్సువల్ కమ్యూనిటీకి చెందిన పురుషులు తమ లైంగిక భాగస్వాముల సంఖ్యను తగ్గించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కోరింది. అలాగే, కొత్త వ్యక్తులతో లైంగిక సంబంధాలపై పునరాలోచించుకోవాలని కోరింది. ఆఫ్రికా వెలుపల నమోదైన మంకీ పాక్స్ కేసుల్లో 98 శాతం కేసులు గే, బైసెక్సువల్ సంబంధాలు కలిగిన పురుషుల్లోనే బయటపడ్డాయని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ బుధవారం (జూలై 27) ఒక ప్రకటన చేశారు…మంకీపాక్స్ సోకినవారిలో ఇప్పటివరకూ ఐదుగురు మృత్యువాత పడినట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వెల్లడించారు. వ్యాధి బారినపడినవారిలో నొప్పి కారణంగా 10 శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలిపారు. మంకీపాక్స్‌ను ప్రతీ ఒక్కరూ సీరియస్‌గా తీసుకొని తగిన చర్యలు తీసుకోగలిగితే వ్యాధి వ్యాప్తిని అరికట్టగలమని అన్నారు. కాగా, ఇటీవల ఇంగ్లాండ్ సైంటిస్టుల అధ్యయనంలోనూ గే లేదా బైసెక్సువల్ కమ్యూనిటీకి చెందిన పురుషుల్లోనే మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గత నెలలో ఇంగ్లాండ్‌లో ప్రచురితమైన ఓ మెడికల్ జర్నల్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. డబ్ల్యూహెచ్ఓ చేసిన తాజా ప్రకటనతో గే, బైసెక్సువల్ కమ్యూనిటీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది…