ఇండియా, చైనా లాంటి మిత్ర‌దేశాలు శ్రీలంక‌ను ఆదుకోవాలు…స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్…

శ్రీలంక‌లో తీవ్ర సంక్షోభం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఆ దేశ మాజీ క్రికెట‌ర్‌, మేటి స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ స్పందించారు. ప్ర‌స్తుతం ఐపీఎల్ కోసం ఇండియాలో టూర్ చేస్తున్న ఆయ‌న ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశంలోని రాజ‌కీయ‌వేత్త‌లు, అధికారులు, వ్యాపార‌వేత్త‌లు ఒక్క‌టి కావాల‌న్నారు. లంక క‌రెన్సీ ప‌త‌నంతో ఆ దేశంలో ప్ర‌స్తుతం దుర్భ‌ర స్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముర‌ళీధ‌ర‌న్ రియాక్ట్ అవుతూ.. ..చాలా మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని, ఇంధ‌న ధ‌ర‌లు చుక్క‌ల్ని అంటాయ‌ని, వీటితో పాటు నిర్వ‌హ‌ణ లోపం ఉన్న‌ట్లు ముర‌ళీ అన్నారు. కానీ ఒక్క నిర్వ‌హ‌ణా లోప‌మే ఈ విప‌త్తుకు కార‌ణం కాద‌న్నారు. ఇండియా, చైనా లాంటి మిత్ర‌దేశాలు శ్రీలంక‌ను ఆదుకోవాల‌న్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్ లాంటి సంస్థ‌లు కూడా సాయం చేయాల‌న్నారు.

శ్రీలంక‌లో ఏర్ప‌డిన ఆర్థిక సంక్షోభం ఒక్క రోజులో ఏర్ప‌డింది కాద‌న్నారు. చాన్నాళ్ల నుంచి దేశంలో గ‌డ్డు ప‌రిస్థితులు ఏర్ప‌డుతూనే ఉన్నాయ‌న్నారు. శ్రీలంక చాలా చిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ అని, దిగుమ‌తులు ఎక్కువ‌, ఎగుమ‌తులు త‌క్కువ అని ముర‌ళీ తెలిపారు. డాల‌ర్ సంక్షోభం కూడా శ్రీలంక‌ను తాకిన‌ట్లు చెప్పారు. ఎక్కువ శాతం స‌ర‌కుల్ని దిగుమ‌తి చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని, ప్ర‌స్తుతం ర‌వాణా ఛార్జీలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయ‌ని, వంద డాల‌ర్ల‌కు వ‌చ్చే వ‌స్తువుల కోసం ఇప్పుడు 700 డాల‌ర్లు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇంధ‌న‌ బిల్లులు కూడా పెరిగిపోతున్న‌ట్లు తెలిపారు. ఇదంతా ఒక్క రోజులో జ‌రిగింది కాద‌ని, క్ర‌మ‌క్ర‌మంగా స‌మ‌స్య‌లు పెరిగిన‌ట్లు చెప్పారు.