కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న హీరో సూర్య….

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఆకాశమే నీ హద్దురా సినిమాతో కెరీర్ హిట్ అందుకున్న సూర్య గత వారం కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తాను కరోనా పాజిటివ్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ ట్వీట్ ద్వారా అందరికీ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘దేశంలో రోజూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా పోయిందని అనుకుంటే అది మన మందబుద్ది అవుతుంది. కరోనా ఇంకా అదే స్థాయిలో ఉంది. అందరూ కరోనా నియమాలను తప్పక పాటించాల’ని సూర్య చెప్పారు. అయితే గత వారం కరోనా పాజిటివ్ రావడంతో సూర్య చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా సూర్య ఆరోగ్యం బాగానే ఉందని, అంతా క్షేమమని సూర్య తమ్ముడు కార్తీ తెలిపారు. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచ్చిందని, ఇటీవల ఇంటికి తీసుకువచ్చామని కార్తీ ట్వీట్ చేశారు. ‘అన్నయ్య ఆరోగ్యం అంతా సర్దుమనిగింది, మీ ప్రార్థనలు ఫలించాయి. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే’ నంటూ కార్తీ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా సూర్య మరికొన్నాళ్లు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు కూడా తెలిపారు…