ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చాం… ఎంపి కేశవరావు

R9TELUGUNEWS.COM: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కొత్త వివాదాలకు తెరతీస్తున్నారని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఏపీ విభజనపై రాజ్యసభలో ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు..8ఏళ్ల క్రితం పార్లమెంట్‌ ఘోర తప్పిదం చేసినట్టు ప్రధాని మోదీ మాట్లాడారు. పార్లమెంట్‌ ద్వారానే మన దేశం నడుస్తోంది. ప్రధాని స్థాయిలో మోదీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొత్త వివాదాలకు మోదీ తెర తీస్తున్నారు. పార్లమెంట్‌ ప్రొసీడింగ్‌ చూసేది రాష్ట్రపతి, మొత్తం సభ. సభలో ఏది జరిగినా సభ్యులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారు. రాజ్యాంగంలోని నియమాల ప్రకారమే సభ నడస్తుంది. పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌ను న్యాయస్థానంలో కూడా సవాల్‌ చేయలేం. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చాం. సభ ప్రొసీజర్స్‌ను, ప్రొసీడింగ్స్‌ను మోదీ సవాల్‌ చేస్తున్నారు. పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రశ్నించే హక్కు మోదీకి లేదు. 8ఏళ్ల తర్వాత సభలోని అంశాలపై అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరం. భాజపా ప్రభుత్వమే ఇప్పుడు ఎన్నో నిబంధనలు ఉల్లంఘిస్తోంది. పార్లమెంట్‌ను కించపరిచే విధంగా మోదీ వ్యాఖ్యలు చేయడం తగదు. దేవాలయంగా భావించే పార్లమెంట్‌పై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరం’’ అని కేశవరావు అన్నారు. తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌ తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.