అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కాదు…. దమ్ముంటే నాకు సంకెళ్లు వెయ్… ఎంపీ కోమటి రెడ్డి.

*దమ్ముంటే నాకు సంకెళ్లు వెయ్… కోమటి రెడ్డి*

యాదాద్రి కలెక్టరేట్: అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కాదు…. దమ్ముంటే నాకు వేయ్ సంకెళ్లు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం రాయగిరిలో ఆర్ ఆర్ ఆర్ భూ నిర్వాసితుల పోరాటంలో జైలుకెళ్లి విడుదల అయిన రైతులను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండి నిరసన తెలిపితే వారికి సంకెళ్ళు వేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో వేల కోట్లు దండుకుంటున్నారున్నారు. అలైన్మెంట్ లో మార్పులు చేస్తే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భూములు అటు ఆలేరు సునీత మహేందర్రెడ్డి భూములు కోల్పోతారని పేద రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

భువనగిరి డీసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ వారు రైతులు కారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపడమే కాకుండా టెర్రరిస్టులకు, దొంగలకు, రౌడీ షీటర్ల మాదిరిగా సంకెళ్లు వేసి కోర్టులో హాజరు పరచడం ఏంటని ప్రశ్నించారు. భువనగిరి డిసిపి రైతులు కాదని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉంటుందని వారికి తలోగ్గి పోలీసు వారు పనిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య, బర్రె జహంగీర్, పోత్నక్ ప్రమోద్ కుమార్, పంజాల రామాంజనేయులు, కానుగు బాలరాజు తదితరులు ఉన్నారు.