జమిలి ఎన్నికలు జరగగానే.. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పిన రేవంత్…

జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఎప్పుడైనా జమిలి రావొచ్చు అనే అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో జమిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి.. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఒకరిని మించిన వారు ఒకరు అంటూ మీడియా చిట్‌చాట్‌లో విమర్శించిన ఆయన.. కేంద్ర బడ్జెట్‌లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు. గతంలో బీహార్‌కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు .. ఏమైంది ..? అని ప్రశ్నించిన రేవంత్.. ఎప్పటికప్పుడు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం మోడీ, కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య ఆరోపించారు. ఈ సందర్భంగా జిమిలీ ఎన్నికలపై స్పందించిన రేవంత్.. జమిలీ ఎన్నికలు జరిగితే.. దేశం రెండుగా విడిపోవడం ఖాయమన్నారు.. అధ్యక్షుడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసరం పడవు.. అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే.. దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారని వ్యాఖ్యానించారు.. జమిలి ఎన్నికలు జరగగానే.. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పిన రేవంత్… దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు .. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి… నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని ఆరోపించిన ఆయన.. మోదీ ప్రధాని అయ్యాక ప్రాధాన్యత కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాధివారికే కట్టబేడుతున్నారని విమర్శించారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారే.. కానీ, నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయని దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలీ ఎన్నికల ఆలోచనను మోడీ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గం.. దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు కాంగ్రెస్ ఎంపీ.. రాజ్యాంగాన్ని సవరణలు చేసినప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముంది? అని ప్రశ్నించిన ఆయన.. వ్యవసాయ చట్టాల విషయంలో మోడీపై ఎవరి ఒత్తిడి ఉంది? అని ప్రశ్నించారు.