రేపటి నుండి మృగశిర కార్తె ప్రారంభం మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..?.

భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు.. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలుపెడతారు.

*ఎలా ప్రారంభమవుతుంది..?*

చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు… అశ్వినితో ప్రారంభమై రేవతీతో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది.

*మృగశిర కార్తెను ఎలా జరుపుకోవాలి..?*

మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర , మృగం , మిరుగు , మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.. వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు / ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని ప్రజల విశ్వాసం..

*పురాణ ప్రాశస్త్యం:*

వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలోనూ కనిపిస్తుంది.. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు , తేజస్సు మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే ప్రాచీన వైద్యుడు.. తన గ్రంథాల్లో వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందగలరు..