నామినేషన్ వెల చిత్రమైన ఘటన…ర్యాలీ మధ్యలో నుంచే ఉరుకులు, పరుగులు పెట్టిన నాయకుడు…!

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. భారీ ర్యాలీలు, బలప్రదర్శన చేస్తూ నామినేషన్లు వేయడం జరిగింది. అయితే.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడిన నేతలు కొందరు ఉంటే.. ర్యాలీలో పడి అసలు విషయం మరిచిపోయిన నేతలు మరికొందరు ఉన్నారు. ఇక నామినేషన్ వేయడానికి అభ్యర్థులు వచ్చిన తీరులో చిత్ర విచిత్రాలన్నీ చూడాల్సిన పరిస్థితి…
సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నియోజకవర్గమైన మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నాడు నామినేషన్ కూడా వేశారు. అయితే.. ఇంతవరకూ అంతా బాగుంది కానీ.. చివరి నిమిషంలో కోమటిరెడ్డి నామినేషన్ వేయాల్సి రావడంతో నానా హైరానా పడాల్సి వచ్చింది. నామినేషన్‌కు ముందు భారీ ర్యాలీగా.. కార్యకర్తలు, అభిమానులతో రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు బయల్దేరారు. అభిమానం పోటెత్తడం, అడుగడుగునా ఈలలు, కేకలు.. నినాదాలతో హోరెత్తడం, పైగా ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా ఇవాళే నామినేషన్ వేయడంతో ఆ జోష్‌లో రాజగోపాల్ రెడ్డి మునిగిపోయారు. దీంతో అసలు నామినేషన్ దాఖలు చేయాలన్న విషయం మరిచిపోయినట్లున్నారు. పైగా సమయం కూడా మధ్యాహ్నం 3 గంటల వరకే కావడంతో ‘అర్రే.. టైమ్ అయిపోయిందే..’ అని ర్యాలీ మధ్యలో నుంచే ఉరుకులు, పరుగులు పెట్టారు రాజా.!.
రిటర్నింగ్ ఆఫీసుకు 500 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపేస్తారు కదా.. ఇక కారు దిగడం ఆలస్యం రాజగోపాల్ ఒక్కటే పరుగే పరుగు..! ఆయనతో పాటు సెక్యూరిటీ, ప్రధాన అనుచరుడు కూడా ఉరకాల్సి వచ్చింది. ఆఖరికి గడువుకు కాస్త ముందు వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. వాస్తవానికి.. నిమిషం ఆలస్యం అయినా సరే పరీక్షల్లోకి నో ఎంట్రీ లాగానే.. నామినేషన్లు కూడా స్వీకరించరు. మంచి ముహూర్తం ఉండటంతో ముఖ్యనేతలంతా గురువారం రోజునే నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ఒక్క సెట్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా.. శుక్రవారం నాడు మరో సెట్ నామినేషన్ వేసేందుకు రాజగోపాల్ ఏర్పాట్లు చేస్తున్నారు. చూశారుగా.. ఇదీ సంగతి. ప్రస్తుతం ఈ ఉరుకులు, పరుగులకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కామెంట్స్ గురించి అయితే మాటల్లో చెప్పలేం.. ఆ రేంజ్‌లో వస్తున్నాయ్.!