కేఏ పాల్ తన ప్రచారంలో హంగామా…చేతి అన్ని వేళ్లకూ ఉంగరాలు..నవ్వులు పూయిస్తోన్న కేఏ పాల్‌ సమాధానం!

మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కేఏ పాల్ తన ప్రచారంలో చేసిన హంగామా అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో కామెంట్లు, హావభావాలతో వార్తల్లో నిలిచిన ఆయన.. పోలింగ్‌ రోజూ తన పంథా కొనసాగించారు. నియోజకవర్గం పరిధిలోని 100 పోలింగ్‌ కేంద్రాలను చుట్టి రావాలని పాల్‌ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా హడావుడిగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తూ తిరిగి పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పాల్‌కు ఉంగరం గుర్తును ఈసీ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయన తన రెండు చేతుల అన్ని వేళ్లకూ ఉంగరాలు ధరించి పోలింగ్‌ కేంద్రాల్లో తిరిగారు. ఉంగరం గుర్తు కేటాయిస్తే చేతికి ఉంగరాలతో రావడం ఎన్నికల నిబంధన ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించగా.. పాల్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తెరాస గుర్తు కారు అని.. ఆ పార్టీ నేతలు 30వేల కార్లలో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.