ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ దుర్మరణం…!

ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ దుర్మరణం

మెట్లపై నుంచి జారి పడటంతో కన్నుమూత

ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్ మత్తయ్య జార్జ్ ముత్తూట్ (72) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడి మరణించినట్టు తెలుస్తోంది. దీంతో ఎంజీ జార్జ్ ముత్తూట్ హఠాన్మరణంపై వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాయి.

1949,నవంరులో కేరళలోని పఠనమిట్ట జిల్లాలోని కోజెన్‌చేరిలో జన్మించారు జార్జ్‌ ముత్తూట్‌. కుటుంబ వ్యాపారంలో చిన్న వయస్సులోనే ప్రవేశించారు. మూడో తరానికి చెందిన వారు. 1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవిని చేపట్టిన ఆయన 1993 లో ముత్తూట్‌ గ్రూపు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి జార్జ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 51 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8వేల 722 కోట్ల రూపాయలకు చేరింది. ఆయనకు భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు జార్జ్ ఎం జార్జ్ ఈ బృందానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాగా, చిన్న కుమారుడు అలెగ్జాండర్ జార్జ్ డైరెక్టర్‌ గా ఉన్నారు. కాగా రెండవ కుమారుడు పాల్ ముథూట్ జార్జ్ 2009 లో హత్యకు గురయ్యారు.

కాగా దేశంలోనే అతి పెద్ద బంగారు ఆభరణాల తనఖా రుణాలసంస్థగా పేరున్న ముత్తూట్‌ ఫైనాన్స్‌కు 5,000 బ్రాంచీలు ఉన్నాయి. 20కి పైగా వ్యాపారాలు, 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్‌ ఛైర్మన్‌గా కూడా జార్జ్‌ ముత్తూట్‌ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్‌ ఆసియా మ్యాగజీన్‌ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020 నాటికి ర్యాంకింగ్‌ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు.