సుమారు 600 మంది మయన్మార్‌ సైనికులు భారత్‌లోకి..!..

మయన్మార్‌ సైనికులు (Myanmar Soldiers ) భారత్‌లోకి పెద్ద సంఖ్యలో చొరబడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది..పొరుగు దేశమైన మయన్మార్‌లో తిరుగుబాటు దళాలు, సైనిక ప్రభుత్వం జుంటా మధ్య తీవ్ర పోరాటం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మయన్మార్ ఆర్మీకి చెందిన వందలాది మంది సైనికులు ప్రాణభయంతో పారిపోయి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. మయన్మార్‌లో తీవ్ర ఘర్షణల నేపథ్యంలో సుమారు 600 మంది సైనికులు మిజోరంలోకి చొరబడ్డారు. అస్సాం రైఫిల్స్ క్యాంపులో ఆశ్రయం పొందారు.

కాగా, మరింత మంది మయన్మార్‌ సైనికులు ప్రవేశిస్తుండటంపై మిజోరం సీఎం లాల్దుహోమా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సుమారు 450 మంది మయన్మార్‌ సైనికులను వాయు మార్గంలో తిరిగి పంపినట్లు చెప్పారు. అయినప్పటికీ వందలాది మంది మయన్మార్‌ సైనికులు ఆశ్రయం కోసం మిజోరంలోకి చొరబడుతున్నారని తెలిపారు..మరోవైపు మయన్మార్‌ సైనికుల చొరబాటు ఉద్రిక్తతలకు దారి తీయడంతోపాటు ఈ ప్రాంతం స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని మిజోరం సీఎం లాల్దుహోమా ఆందోళన వ్యక్తం చేశారు. షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి ప్లీనరీ సమావేశంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. మయన్మార్‌ సైనికులను త్వరగా తిరిగి పంపేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు…