చంద్రబాబు పై ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు: లోకేశ్‌

*రాజమహేంద్రవరం.. ప్రజా సంక్షేమమే తప్ప అవినీతి చేయడం తమ కుటుంబ రక్తంలోనే లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో మీడియాతో లోకేశ్‌ మాట్లాడారు. ”ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరేమీ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఎప్పుడూ ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్‌ అని బిల్‌గేట్స్‌, క్లింటన్‌, ఫార్చూన్‌ 500 సీఈవోలూ చెబుతారు. అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి సైకో జగన్‌ ప్రభుత్వం జైలుకు పంపింది” అని దుయ్యబట్టారు.

జగన్‌కు ఒళ్లంతా విషమే..పాముకు తలలోనే విషం ఉంటుంది.కానీ, జగన్‌కు ఒళ్లంతా విషమే. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చింది. తెదేపా బంద్‌కు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలిపారు. బంద్‌ను జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు. బంద్‌లో పాల్గొన్న జనసేన, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. చంద్రబాబు జోలికి రావడం సైకో జగన్‌ చేసిన అతిపెద్ద తప్పు. జగన్‌ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారు.” అని లోకేశ్‌ హెచ్చరించారు. .