నానుడి కథలు ..మేకపోతు గాంభీర్యం.

*నానుడి కథలు ..

*మేకపోతు గాంభీర్యం.

లోపల భయం ఉన్నా, దాన్ని బయటకు కనిపించకుండా ధైర్యంగా ఉన్నట్టు నటించటాన్ని ‘మేకపోతు గాంభీర్యం’ నానుడితో పోలుస్తారు. ఈ నానుడి జానపదులు చెప్పుకునే ఓ కథ ద్వారా వాడుకలోకి వచ్చి వుండవొచ్చు. ఇది దాదాపుగా మనందరికి తెలిసిన కథే. ఈ కథ ఏమిటో చూద్దాం.
పూర్వం ఓ మేకల కాపరి తన మేకలను తోలుకుని అడవిలోకి వెళ్ళాడు. వాటిలో ఓ పోతు ఉంది. అది ఎత్తుగా, బలంగా, దృడంగా ఉంది. మేకలన్నీ ఆకులు అలమలు మేసి సాయంత్రానికి ఇంటి దారి పట్టాయి. అయితే ఆ పోతు మాత్రం ఏమరపాటుగా మేకల మందలోనుండి తప్పిపోయింది. ఎంత వెదికిన మంద కనిపించలేదు. చీకటి పడింది. రాత్రి చీకటిలో ఎక్కడ తల దాచుకోవాలో అర్ధం కాక ప్రక్కనే ఉన్న ఓ గుహలో దూరి చీకటిలో పడుకుంది. గుహ బయటకు నిక్కినిక్కి చూస్తుంది. అది మృగరాజు సింహం గుహ. అదే సమయంలో సింహం కూడా వచ్చింది. గుహ లోపలికి వెళ్లబోయింది. దానికి గుహ లోపల పడుకున్న మేకపోతు కళ్ళు చీకటిలో మెరుస్తూ కనిపించాయి. సింహానికి పై ప్రాణాలు పైనే పోయాయి. అదేదో కొత్త, వింత జంతువు, తన కన్నా బలమైన క్రూర మృగం ఏదో గుహలోనికి దూరింది అనుకుంది. గుహ బయటే ఆగిపోయింది. “లోపల ఎవరూ?” అని చిన్నగా అరచింది. లోపల మేక పోతూ పరిస్థితి కూడా అలాగే వుంది. బయటి వెలుతురులో సింహాన్ని చూడగానే దాని మతి పోయింది. భయంతో కాళ్ళు గడగడా వణక సాగాయి. అయినా భయాన్ని కనిపించకుండా గంభీర స్వరంతో ” నీవెవరూ?” అంది.
ఆ గంభీర స్వరానికి సింహం ఇంకా భయపడుతూ “నేనూ సింహాన్ని. ఈ అడవి మొత్తానికి మృగరాజును” అంది భయంతో కూడిన గొంతుతో. వెంటనే మేక పోతు “ఓహో సింహానివంటే నీవేనా? నేను ఇప్పటివరకు వేయి ఏనుగుల్ని, ఐదువందల పులుల్ని చంపితిన్నాను. సింహాన్ని ఎప్పుడూ తినలేదు. ఇప్పుడు కుదిరింది అవకాశం. అక్కడే ఉండు. వస్తున్నా?” అంది సింహం భయాన్ని గమనించి ధైర్యంగా. ఆ మాట అనగానే సింహం అక్కడ నుండి పరుగందుకుని పారిపోయింది. ఆ రాత్రి మేకపోతు ఆ గుహలోనే ఉండి తెల్లవారు జామున లేచి వెళ్ళింది. తన మందలో కలిసింది. అది కథ.
ఆపద వచ్చినప్పుడు డీలా పడి పోకుండా మేకపోతులా గాంభీర్యం ప్రదర్శించి, ధైర్యంగా ఉండి ఆపదల నుండి గట్టెక్కలని ఈ కథ చెబుతుంది. ఈ కథ నుండే *మేకపోతు గాంభీర్యం* నానుడి వాడుకలోకి వచ్చింది.
*౼ డా.దార్ల బుజ్జిబాబు*