నరక చతుర్దశి…

24/10/2022 నరక చతుర్దశి

దీపావళి పండుగలో మొదటిరోజు నరక చతుర్దశి. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసుర సంహారం జరిగింది. నరకుడు లోక కంటకుడైనా, అతనిపేరుతో ప్రజలు పండుగ జరుపుకోవాలని అతనికి వరం ఉన్నది. ఈ కారంణంగా నేటికీ నరక చతుర్దశి పండుగగా ఆచరింపబడుతున్నది.

పురాణగాథల ప్రకారం కృత యుగంలో భూదేవికి వరాహస్వామికి జన్మించిన నరకుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని రాక్షస ప్రవృత్తితో ముల్లోకాలను కలవరపెడుతున్నప్పుడు దేవతలు విష్ణువును సహాయం అర్థిస్తారు. తాను శ్రీకృష్ణావతారంలో నరకుని వధించెదనని విష్ణువు దేవతలకు నచ్చచెబుతాడు. అయితే భూదేవి విష్ణువు నుండి వరం పొంది ఉంటుంది. నరకుడు చాలా కాలం జీవించాలని, అతడు తల్లి అయిన తన చేతులలో మరణించాలని, మరియు అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరగా ఆ కోర్కెలకు విష్ణువు అంగీకరించి వాటిని వరాలుగా ఇస్తాడు. విష్ణువు కృష్ణావతారం ఎత్తినప్పుడు భూదేవి సత్యభామగా అవతరిస్తుంది.

నరకుడు దేవతల తల్లి అయిన అదితి కర్ణకుండలాలను అపహరిస్తాడు. పైగా పదహారు వేలమంది రాజకన్యలను కూడా అపహరించి బందీ చేస్తాడు. అదితి సత్యభామకు బంధువు. దీనితో సత్యభామ కోర్కెతో శ్రీకృష్ణుడు నరకునిపై దండెత్తి దీర్ఘకాలం యుద్ధం చేస్తాడు, నరకాసురుడు కృష్ణునిపై పెక్కు దివ్యాస్త్రాలను ప్రయోగించగా, కృష్ణుడు వాటిని తిప్పికొట్టి చివరకు సుదర్శన చక్రంతో నరకుని సంహరిస్తాడు. అదితికి కుండలాలు తిరిగి వస్తాయి. పదహారువేలమంది కన్యలు రక్షింపబడతారు.

నరకాసురుని దురాగతాలు విరగడయినందుకు ప్రజలు సంతోషించి పండుగ వేడుకలు జరుపుకొంటారు. మరుసటి రోజు అమావాస్య కావడతో చీకట్లు ముసురుతాయి. ఆ చీకట్లను పారదోలడానికై ప్రజలు దీపాలు వెలగిస్తారు.