అంతరిక్షంలో అద్భుతమైన గ్యాస్ బెలూన్ ‘బబుల్ నెబ్యులా’… ఫొటో, వివరాలు విడుదల చేసిన నాసా…

అంతరిక్షంలో అద్భుతమైన గ్యాస్ బెలూన్ ‘బబుల్ నెబ్యులా’… ఫొటో, వివరాలు విడుదల చేసిన నాసా

మన విశ్వం ఎన్నో విచిత్రాలు, వింతలకు నిలయం. అందులో మనకు తెలియని, మనం ఊహించలేని ఎన్నో ఉన్నాయి. నాసా తమ పరిశోధనల్లో వాటిని గుర్తిస్తూ మనకు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక అద్భుతమైన ‘బబుల్ నెబ్యులా’ చిత్రాన్ని విడుదల చేసింది. భూమికి 7,100 కాంతి సంవత్సరాల దూరంలో కాస్సియోపియా నక్షత్ర మండలంలో ఈ చిత్రమైన నెబ్యులా ఉన్నట్టు ప్రకటించింది.

అత్యంత భారీగా..
నీలి రంగులో ప్రకాశవంతంగా మెరిసిపోతున్న బబుల్ నెబ్యులా.. మన సూర్యుడికన్నా 45 రేట్లు పెద్దగా ఉన్న ఓ నక్షత్రం చుట్టూ ఆవరించి ఉన్నట్టు నాసా తెలిపింది. ఆ నక్షత్రంలో జరిగే ఉష్ణ, రసాయనిక చర్యలతో పదార్థం బయటికి వెలువడి నెబ్యులాగా విస్తరించిందని పేర్కొంది. ఇది ఏకంగా ఏడు కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉందని వివరించింది.

ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక ఏడాదిలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం అన్నమాట. కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఏడాదిలో ఎంత దూరమో ఊహించుకోవడమే కష్టం. ఆ దూరాన్ని లెక్కల్లో చెప్పలేకనే.. కాంతి సంవత్సరాల్లో చెబుతుంటారు.