నవంబర్‌ 3న ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం నవంబర్‌ 3న మొదలవనున్నాయి. శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుండగా.. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5న ఆదివారం నామినేషన్ల కార్యక్రమానికి సెలవు. ఎక్కడా వివాదాలు లేకుండా, పారదర్శకత కోసం ఆర్డీవో కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.నామినేషన్ల స్వీకరణ 3న మొదలై 10వ తేదీ వరకు కొనసాగనున్నది. 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణ, అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 30న ఓటింగ్‌ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కమిషన్‌ ఈ సారి పలు మార్పులు చేసింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్లు దాఖలు చేసే అవకాశం ఉండగా.. అఫిడవిట్‌ అసంపూర్తిగా ఉంటే.. రిటర్నింగ్‌ అధికారి సదరు అభ్యర్థికి నోటీసులు జారీ చేసి.. సవరించాల్సిందిగా సూచిస్తారు. అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్‌ తిరస్కరించేందుకు అవకాశం ఉంటుంది.