మరో పొరుగు దేశమైన నేపాల్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనే సూచనలు..!!

విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది...

మరో పొరుగు దేశమైన నేపాల్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు బాధ్యుడిని చే స్తూ దేశ సెంట్రల్‌ బ్యాంకు అయిన ‘నేపాల్‌ రాష్ట్ర బ్యాంకు’(ఎన్‌ఆర్‌బీ) గవర్నర్‌ మహా ప్రసాద్‌ అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయానికి తగిన కృషి చేయకపోవడాన్ని కారణంగా చూపింది. కొన్ని అంశాల్లో ఆ ర్థిక మంత్రి జనార్దన్‌ శర్మతో విభేదించడం కూడా మరో కారణం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పురుషోత్తం భండారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకొంది. 2020లో ఆయన నియమితులయ్యారు. పదవీ కాలం అయిదేళ్లు కాగా, ముందుగానే వైదొలగాల్సి వచ్చింది. రాష్ట్ర బ్యాంకు గవర్నర్‌ను సస్పెండ్‌ చేయడం చరిత్రలో ఇది రెండోసారి. విదేశీ ద్రవ్య నిల్వలు తరిగిపోతుండడంతో ఇతర దేశాల నుంచి విలాస వస్తువులు, వాహనాల దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. గత ఏడాది జులై నాటికి 11.75 బిలియన్‌ డాలర్ల మేర నిల్వలు ఉండగా, ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నాటికి 9.75 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇవి మరో 6 నెలల 3 వారాల అవసరాలకు సరిపోతాయి. అందువల్ల చమురు, ఇతర అత్యవసరాలు మినహా ఇతర వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. కాగా, నేపాల్‌లో శ్రీలంక పరిస్థితులు తలెత్తవని ఆర్థిక మంత్రి జనార్దన్‌ శర్మ చెప్పారు. విదేశీ రుణ భారం తక్కువగా ఉందని, రెవెన్యూ వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నందున ఇబ్బందులు ఎదురవవని తెలిపారు.