నేపాల్ విమాన ప్రమాదం లో ఇప్పటి వరకు 14మంది మృతదేహాల వెలికితీత….

నేపాల్‌ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశామని, మిగతావారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 ఎన్‌-ఏఈటీ ట్విన్‌ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటల సమయంలో ముస్తాంగ్‌లో గల్లంతైన విషయం తెలిసిందే. విమానం ఆచూకీని సోమవారం ఉదయం సైన్యం గుర్తించింది. ప్రతికూల వాతావరణం ఉండటంతో సన్సోవార్‌లో ఉన్న కొండల అంచులను ఢీకొట్టిన విమానం 14,500 అడుగుల లోతులో పడిపోయింది. దీంతో విమానం ఆచూకీని గుర్తించడానికి అధికారులకు ఆల‌స్యం అయ్యింది. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉన్నారు. కాగా, సోమవారం ఉదయం గాలింపు, సహాయక చర్యలు ప్రారంభించిన సైన్యం సన్సోవార్‌ సమీపంలో శకలాలను గుర్తించారు..
విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 16 మంది నేపాలీ దేశస్థులున్నారు. ల్యాండ్ కావడానికి ఐదు నిమిషాల ముందు ఫోఖారా (Pokhara) కంట్రోల్ టవర్ తో సంబంధాలు తెగిపోయినట్లు, ధౌలగిరి పర్వతం ఉన్న ప్రాంతంలో విమానం క్రాష్ అయినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు గుర్తించారు. నేపాల్ సైన్యానికి చెందిన సైనికులు, ఇతర రెస్క్యూ వర్కర్లు దాదాపు 14 వేల 500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై పని చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు బాగా లేవని, మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నామన్నారు. 2018లో ఢాకా నుంచి ఖాట్మండుకు వెళ్లిన యూఎస్ (US) బంగ్లా ఎయిర్ లైన్స్ విమానంలో 71 మంది ప్రయాణీకులున్నారు. క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 51 మంది మరణించారు….