నేటి కథ..గాడిద సలహా..!

డా॥ ఎం. హరికిషన్..

ఒక రోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువుకు పోయింది.
అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గాడిద పిల్లి ఎలా చేపలు పడతాదా అని చూడసాగింది.
కాసేపయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుకుంది.
నెమ్మదిగా దానిని బైటికి తీయసాగింది.
అంతలో అది చూసిన గాడిద “పిల్లిబావా… అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది?
దానిని వదిలెయ్యి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలు ఉన్నాయి”
అనింది.
ఆ మాటలు విని పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళలోకి వదిలి మరలా గాలం వేసింది.
కొంచంసేపటికి ఇంకొంచం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది.
దానిని చూసి గాడిద నవ్వి… “ఇది కూడా ఏమంత పెద్దగా లేదు. ఇంత కంటే
మంచి చేపలు అందరూ ఆనందంగా పట్టుకొని పోతావుంటే నువ్వు ఇంత చిన్న చేపను
పట్టుకొని పోతే నవ్వరా” అనింది.
ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలి వేసింది పిల్లి. ఈసారి మొదటి చేప
కన్నా చిన్న చేప పడింది. “ఛీ… ఛీ” అంటూ వికారంగా మొహం పెట్టింది గాడిద. పిల్లి
సిగ్గుపడి దానిని కూడా వదిలి వేసింది.
మరలా గాలం వేసింది.
ఈసారి ఎంత సేపున్నా ఒక్క చేప కూడా పడలేదు.
నెమ్మదిగా చీకటి పడింది.
ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒల్లతా నీరసంగా ఇపోయింది.
“అబ్బ నాకు ఆకలి అవుతూ వుంది. రేపు కలుద్దాం” అంటూ చెరుకు తోట వైపు
వెళ్ళిపోయింది గాడిద.
పిల్లి చుట్టూ చూసింది. జంతువులన్నీ దొరికిన చేపలను హాయిగా తింటున్నాయి.
“అయ్యో… అనవసరంగా ఒక పెద్ద చేప కోసం దొరికిన మూడు చేపలను
వదులుకుంటినే. ఆ మూడు కలిపితే ఎంత పెద్దగయ్యేవి. హాయిగా కడుపు నిడిపోయేది.
ఆ గాడిద మాటలు విని ఈ రోజు తిండి లేకుండా పడుకొవలసి వచ్చింది” అనుకుంటూ
బాధగా వెళ్ళిపోయింది పిల్లి.