నేటి కథ..ఒంటె జాడ తెలిసిందిలా!..

*✍🏼 నేటి కథ ✍🏼*

ఒకరోజు తెనాలి రామకృష్ణుడు అడవి గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. దారిలో ఒక వ్యాపారి ఆయనను ఆపి, నేను దారి తప్పిపోయిన నా ఒంటెను వెతుకుతున్నాను. దారిలో నీకు ఏమైనా కనిపించిందా? అని అడుగుతాడు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ ఒంటె కాలికి గాయమైందా! అంటాడు. అవును. అంటే మీరు నా ఒంటెను చూశారన్నమాట అంటాడు వ్యాపారి. నేను ఆ ఒంటె పాదముద్రలు మాత్రమే చూశాను. చూడండి ఆ మూడు పాద ముద్రలు. ఒక కాలికి గాయం అవడం వల్ల నాలుగో కాలి ముద్ర అస్పష్టంగా ఉంది అని ఆ వ్యాపారితో అన్నాడు. వెంటనే ఆ ఒంటె గుడ్డిదా? అని అడగగానే వ్యాపారి అవును. అవును అని బదులిచ్చాడు. ఆ ఒంటె వీపు మీద ఒకపక్క గోధుమలు, మరోపక్క చక్కెర సంచులు కట్టావా? అని రామకృష్ణుడు అడుగుతాడు. అవును. సరిగ్గా చెప్పావు. అయితే నువ్వు నా ఒంటెను చూసుంటావు అని ఉత్సాహంగా అంటాడు వ్యాపారి. అందుకు రామకృష్ణుడు నేను నీ ఒంటెను చూశానని చెప్పానా! అని ఎదురు ప్రశ్నించగానే నువ్వు నా ఒంటె గురించి అన్ని విషయాలు చెప్పావు కదా! అని వ్యాపారి వాపోతాడు. అప్పుడు రామకృష్ణుడు నేను ఒంటెను చూడలేదు. అయితే దారికి ఒకవైపున్న చెట్ల ఆకులనే మేసింది కాబట్టి ఆ జంతువు గుడ్డిదని, అలాగే గోఽధుమలు కనిపించగానే సంచీకి రంధ్రం ఉన్నదేమోనని, రెండోవైపున చీమల బారును చూసి, ఆ జంతువు చక్కెర సంచులను మోసుకెళుతుందని ఊహించాను. ఈ దారి గుండా వెళితే నీ ఒంటె దొరుకుతుంది అని చెబుతాడు. తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టుగానే కొంత దూరంలోనే ఆ వ్యాపారికి తన ఒంటె కనిపిస్తుంది.