నేటి పంచాంగం..నేటి విశేషం..

ఓం శ్రీ గురుభ్యోనమః
🪻పంచాంగం🪻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 12 – 08 – 2023,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
అధిక శ్రావణ మాసం – బహళ పక్షం,

తిథి : ఏకాదశి ఉ8.02 వరకు,
నక్షత్రం : మృగశిర ఉ8.33 వరకు,
యోగం : హర్షణం సా6.30 వరకు,
కరణం : బాలువ ఉ8.02 వరకు,
తదుపరి కౌలువ రా8.28 వరకు,

వర్జ్యం : సా5.29 – 7.11,
దుర్ముహూర్తము : ఉ5.45 – 7.26,
అమృతకాలం : రా11.26 – 1.09,
రాహుకాలం : ఉ9.00 – 10.30,
యమగండo : మ1.30 – 3.00,
సూర్యరాశి : కర్కాటకo,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.45,
సూర్యాస్తమయం: 6.25,

*_నేటి విశేషం_*

*శ్రావణ బహుళ ఏకాదశి – కామిక ఏకాదశి*
( *”కామిక ఏకాదశి”* )

శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు.

మానవుడు కోరికలు తీరిన తరువాతనే భగవంతుని ధ్యానము చేయగలడు.
భుక్తి కలిగిన వాడే ముక్తి గురించి ఆలోచిస్తాడు కావున, ఈ ఏకాదశి ఉపవాస వ్రతమును ఆచరిస్తే ముందుగా మానవుని కోరికలు తీరుతాయి.
ఆ తర్వాత కొంతకాలానికి కోరికల మీద విరక్తి కలిగి ముక్తి కోసం ఆలోచిస్తాడు.
అందువల్ల ఈ కామిక ఏకాదశి ఉపవాస వ్రతము చేయాలి.

ఈ ఏకాదశి ఉపవాస వ్రతమును ఎక్కడైనా చేయవచ్చు, కానీ పుష్కర క్షేత్రము, ప్రయాగ, సప్త మోక్షపురాలలో ఏదో ఒక పురంలో ఈ వ్రతమాచరించిన వారికి పునర్జన్మ ఉండదు.

ఈ ఉపవాస వ్రతము చేసే వారు తప్పక నదీ స్నానము చేయవలెను.
నదులు అందుబాటులో లేని వారు తమ ఇంటిలోనే స్నానము చేసే నీళ్ళల్లో ఒక తులసీదళం కానీ, ఒక బిల్వ పత్రము కానీ లేదా కొంచెం ఆవు పాలు కానీ వేసుకుని, ఇప్పుడు నేను స్నానం చేస్తున్న నీళ్ళలో గంగా నది వచ్చి ఉండుగాక అని సంకల్పం చేసుకుని స్నానం చేసిన, అలాంటి స్నానం కూడా నదీ స్నానం ఇచ్చే శుభఫలితాలనే ఇస్తుంది.

స్నానానంతరము గురుధ్యానము, గణపతి ధ్యానము చేసి, ఇంటిలో గాని ఆలయంలో గాని యథాశక్తి విష్ణు పూజ చేయాలి.
విష్ణువును భక్తితో ,అష్టోత్తర శతనామములతో కానీ, విష్ణుసహస్రనామముతో కానీ పూజించాలి.
పూజానంతరము ఉపవాసం చేయాలి, కలియుగములో కటిక ఉపవాసము నిషిద్ధము కనుక శరీరము నిలబడుటకు కావలసిన రీతిలో పండుకానీ, పాలు కానీ, అల్పాహారం తీసుకుని ఉపవాసం చేయాలని చెబుతారు…
కామిక ఏకాదశి నాడు యథాశక్తి తప్పక భాగవతమును పారాయణ చేయండి .
అలా చేసిన వారికి తప్పకుండా ఇహము, పరము రెండూ లాభిస్తాయి.
మరునాడు ద్వాదశి ఘడియలలో స్నానానంతరము యథాశక్తి దానధర్మాలు చేసుకుని భోజనం చేయాలి.
భోజనము చేసిన తరువాత మానసికముగా నేను తిన్న భోజనము వలన విష్ణువు సంతృప్తి పొందు గాక అని అనుకోవాలి.
అలా అనుకోగానే విష్ణువు సంతృప్తి చెందుతాడు.
ఇక వాడికి అనుకున్న కోరికలు తీరుతాయి.
కోరిన కోరికలు తీరుతాయి కనుకనే దీనికి కామిక ఏకాదశి అని పేరు.
పూర్వము కుచేలుడు తన భార్య మాట విని కామిక ఏకాదశి వ్రతము ఆచరించి , కృష్ణుడిని పూజించడం వలనే అతనికి కృష్ణుడి అనుగ్రహము కలిగింది.
అనుకున్న కోరికలను తీర్చి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దివ్య తిథి ఈ కామిక ఏకాదశి, ఏ వ్రతమైనా, ఉపవాస దీక్ష అయినా చేసే వాళ్ళు శాంతముగా ఉండాలి.

మరీ ముఖ్యంగా కామిక ఏకాదశి ఉపవాస వ్రతము చేసేవాళ్ళు.
ఇది కోరిన కోరికలు తీర్చే వ్రతము కనుక మరింత జాగ్రత్తగా నియమాలు పాటించాలి.
భార్యాభర్తలు ఒకరిని ఒకరు తిట్టుకోకూడదు.
ఈ ఉపవాస వ్రతము చేసే వాళ్ళు అన్నదానము చేస్తే మరింత ఫలితం వస్తుంది.

గురు భక్తి కలిగిన వారికి ఏ వ్రతమైనా, ఏ దీక్ష అయినా చాలా తొందరగా ఫలితమును ఇస్తుంది.
ఈ విధముగా ఈ కామిక ఏకాదశి ఉపవాస వ్రతమును ఆచరించి శుభములు పొందవచ్చు…

*_🪻శుభమస్తు🪻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏