నేటి పంచాంగం…నేటి విశేషం.

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 06 – 10 – 2023,
వారం … భృగువాసరే శుక్రవారం,
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
భాద్రపద మాసం – బహళ పక్షం,

తిథి : సప్తమి ఉ9.10 వరకు,
నక్షత్రం : ఆర్ద్ర రా12.45 వరకు,
యోగం : వరీయాన్ ఉ9.40 వరకు,
కరణం : బవ ఉ9.10 వరకు
తదుపరి బాలువ రా9.37 వరకు,

వర్జ్యం : ఉ8.19 – 10.00,
దుర్ముహూర్తము : ఉ8.16 – 9.03 &
మ12.12 – 1.00,
అమృతకాలం : మ2.13 – 3.54,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.54,
సూర్యాస్తమయం: 5.44,

*_నేటి విశేషం_*

*మధ్వాష్టమి*

*మధ్వాష్టమి, అనఘాష్టమి, రుద్రాష్టమి*
భాద్రపద బహుళ పక్ష అష్టమి – మధ్వాష్టమి, అనఘాష్టమి, రుద్రాష్టమిగానూ ప్రసిద్ధి చెందింది.
దత్తాత్రేయ స్వామి మూడో అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడి ద్వారా, ఈ అనఘా వ్రతం దత్త సంప్రదాయంలో తలమానికంగా మారింది.
ఇది అందరికీ వెసులుబాటు కలిగించే ‘మాస’వ్రతం…
సంవత్సరానికి ఒక్కసారి ఈ వ్రతం ఆచరించినా, సకల శుభాలూ కలుగుతాయంటారు…
అనఘా దేవి కృప వల్ల విజయాలు సిద్ధిస్తాయని, ఈ వ్రతం చేసినవారికి అన్ని సంకల్పాలూ నెరవేరతాయని భక్తుల నమ్మకం…

అఘం అంటే, పాపం, మనిషిలో కలిగే భయానికి అదే కారణం.
అనఘ అంటే, పాప రహితంగా ఉండటం.
తెలిసో తెలియకో ప్రతి మనిషీ చేసే పనుల్లో- మనసా, వాచా, కర్మణా ఏదో ఒక పాప కార్యం ఉంటుందంటారు.
ప్రకృతి లేదా పరిస్థితుల ప్రభావానికి లోనై, మానవ సహజమైన చాపల్యంతో చేసే అటువంటి పనులే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి…
అనఘా దేవిని ఆశ్రయించడం వల్ల, అడ్డంకులు తొలగి మోక్షమార్గం సుగమమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
జీవితంలో కోరికలు నెరవేర్చే లక్ష్మీ స్వరూపమూ ఆ దేవి కాబట్టి, ఈ వ్రతాన్ని ‘అనఘా లక్ష్మీ వ్రతం’ అనీ పిలుస్తారు.

ఇహపర సాధన మార్గమే- అనఘా వ్రతం.
అనసూయ, అత్రి మహాముని దంపతులకు త్రిమూర్తుల వరబలంతో దత్తుడు జన్మించాడు.
ముగ్గురమ్మల ప్రతిరూపంగా అనఘా దేవి జన్మించి, ఆ తరవాత దత్తదేవుడి ఇల్లాలైంది…
దత్తుడు అవధూత అయినా, గృహస్థ జీవితాన్ని కాదనలేదు, మానవుడు పరిపూర్ణుడిగా పరిమళించడానికే, నాలుగు పురుషార్థాల్నీ నిర్దేశించారు.
ప్రకృతి నుంచి ప్రతి వ్యక్తీ పాఠాలు నేర్చుకోవాలని గురుదత్తుడు ప్రబోధించాడు…
తనకు ఇరవై నలుగురు గురువులున్నారని ప్రకటించిన ఆయన, వైరాగ్య భావన కోసం మానవ జీవితాన్ని కాచి వడబోయాల్సి ఉందని ప్రవచించాడు…

మహా సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి – ఈ ముగ్గురి స్వరూపమే అనఘా దేవి, సరస్వతి అంటే రసస్విని.
ఆమె శ్రుతి మాత, అన్ని విద్యలకూ కాణాచి.
జ్ఞాన ప్రసూనాంబగానూ కొలుస్తారు.
మనిషిలోని సృజనాత్మకతకు జ్ఞానమే ప్రాతిపదిక.
మహాకాళి లయకారిణి, ఆ తల్లి సంహరించేది మనిషిలోని అహంకారాన్నే! నకారాత్మకమైన భావనల్ని ఆమె తొలగిస్తుంది.
అనంతరం మహాలక్ష్మి వరిస్తుంది.
లక్ష్మి అంటే, కేవలం సిరిసంపదలు కావు.
మంచి గుణాల సమాహారం లక్ష్మి.
ఆంతరంగిక సుగుణ సంపత్తికి ఆమె ప్రతీక, ఆ గుణాలన్నీ, ప్రక్షాళన తరవాతే మనిషికి అందుబాటులోకి వస్తాయి…

దేవీ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులూ మహా సరస్వతిని ఆరాధిస్తారు, తదుపరి మూడు రోజులూ మహాకాళిని, మిగతా మూడు రోజులూ మహాలక్ష్మిని పూజించడం ఆనవాయితీ.
క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది, మనిషి తన అంతరంగాన్ని మధించి, హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడే స్వర్ణహస్త శ్రీలక్ష్మీ ప్రసన్నం కలుగుతుందంటారు.
మనిషికి మంచి గుణాలే తరగని సంపద.
పద్మాసన, పద్మహస్తగా లక్ష్మీదేవిని చిత్రించడంలో విశేషమైన అర్థం ఇమిడి ఉంది. ఆత్మజ్ఞానం పొందడమే మానవ జీవితానికి చరమ గమ్యం. యోగమార్గంలో మూలాధారం నుంచి సహస్రారం చేరుకోవడానికి, భక్తి ద్వారా ముక్తి పొందడానికి ఏకైక చిహ్నం కమలమేనని ‘పద్మహస్త’ సూచిస్తుంది.

ముగ్గురు దేవతల మూర్తిగా అవతరించిన అనఘా దేవి వ్రతాన్ని ఆచరిస్తే, సంకల్పసిద్ధి తథ్యమంటారు పెద్దలు…
విఘ్నేశ్వర పూజ చేసి, కలశ స్థాపన నిర్వర్తించి, కుంకుమార్చనతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి, సుభద్రమైన భాద్రపద మాసంలో అనఘా లక్ష్మి వ్రతం చేసుకోవడం శుభప్రదమంటారు.
బహుళాష్టమి నాడు ఏ నెలలోనైనా ఇంట్లో ఈ వ్రతం చేసుకోవచ్చు.
అందువల్ల త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘా లక్ష్మి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు…

*_🍃శుభమస్తు🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏