నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 14 – 11 – 2023,
వారం … భౌమ వాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – శరదృతువు,
కార్తీక మాసం – శుక్ల పక్షం,

తిథి : పాడ్యమి మ2.20 వరకు,
నక్షత్రం : అనూరాధ తె4.09 వరకు,
యోగం : శోభన మ3.19 వరకు,
కరణం : బవ మ2.20 వరకు
తదుపరి బాలువ రా2.05 వరకు,

వర్జ్యం : ఉ7.53 – 9.30,
దుర్ముహూర్తము : ఉ8.22 – 9.07 &
రా10.27 – 11.18,
అమృతకాలం : సా5.37 – 7.14,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.08,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి విశేషం_*

*_కార్తీకమాసం ప్రారంభం_*

*_కార్తీకమాసం విశిష్టత_*
శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెల రోజులు పర్వదినాలే.
కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి , శుభ్రమైన దుస్తులు ధరించి , తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప , దీప , నైవేద్యాలు సమర్పిస్తారు.
ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన , అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.
మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు , గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది.
వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి , పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం.

అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం…

*న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః*

కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు…

కార్తీక మాసంలో ఆర్చనలు , అభిషేకాలతోపాటు , స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే.
నదీస్నానం , ఉపవాసం , దీపారాధన , దీపదానం , సాలగ్రామ పూజ , వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో , దిగుడు బావులలో , పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు.

అందుకే ఈ మాసంలో వాపీ , కూప , తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.
కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ , యమున , గోదావరి , కృష్ణ , కావేరి , నర్మద , తపతి , సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి…
కార్తీకమాసంలో దశమి , ఏకాదశి , ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ , కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి , సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట.

అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున , మాసశివరాత్రినాడు , సోమవారం నాడు , కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.

ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే.
అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పురాణ వచనం…

*కార్తీక శుద్ధపాడ్యమి:* తెల్లవారు జామునే లేచి స్నానం చేసి , అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి , *’నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.*

*విదియ:* ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి , కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.

*తదియ:* అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.

*చవితి:* కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.

*పంచమి:* దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్ర హ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.

*షష్టి:* నేడు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.

*సప్తమి:* ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది.

*అష్టమి:* ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది.

*నవమి:* నేటి నుంచి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

*దశమి:* ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.

*ఏకాదశి:* ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.

*ద్వాదశి:* ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క. తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి , దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది.

*త్రయోదశి:* ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.

*చతుర్దశి:* పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.

*కార్తీక పూర్ణిమ:* మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.

*కార్తీక బహుళ పాడ్యమి:* ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.

*విదియ:* వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.

*తదియ:* పండితులకు , గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.

*చవితి:* పగలంతా ఉపవసించి , సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి , ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.

*పంచమి:* చీమలకు నూకలు చల్లడం , శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.

*షష్ఠి:* గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.

*సప్తమి:* జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.

*అష్టమి:* కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి , కాల భైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.

*_🍃శుభం భూయాత్🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏