నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 16 – 01 – 2024,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : పంచమి ఉ7.31 వరకు
తదుపరి షష్ఠి తె5.18 వరకు,
నక్షత్రం : పూర్వాభాద్ర ఉ11.29 వరకు,
యోగం : పరిఘము రా1.23 వరకు,
కరణం : బాలువ ఉ7.31 వరకు,
తదుపరి కౌలువ సా6.22 వరకు,
ఆ తదుపరి తైతుల తె5.18,

వర్జ్యం : రా8.28 – 9.57,
దుర్ముహూర్తము : ఉ8.51 – 9.35,
మరల రా10.52 – 11.44,
అమృతకాలం : తె5.25 నుండి,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.40,

*_నేటి విశేషం_*

*కనుమ పండుగ*
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు.
పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు, సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే.
పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.

*పశువుల పండుగ*

ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది.

ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు.
అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు.
కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు.
కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి.
అంటే … మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు.

అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది.
దీన్ని *”ఉప్పు చెక్క”* అంటారు.
ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది.
దీన్ని పశువులకు తిని పించాలి.
ఇదొక పెద్ద ప్రహసనం, అవి దీన్ని తినవు.
అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు.
అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు.
గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి, లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు.
ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం.
ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు.
ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు.
మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు.
ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు.

పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం.
ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు.
కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది.
దాన్ని *”చిట్లా కుప్ప”* అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి.
ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు.
అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు.

అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది.
అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు.
పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి.
ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు.
దానిని పిడుగు ముద్ద అంటారు, వాడు పరిగెడుతాడు.
ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు.
ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు.
దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు.
దాన్ని *”పొలి”* అంటారు, ఆ *”పొలి”* ని తోటకాపరి గాని , నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో *”పొలో…. పొలి”* అని అరుస్తూ చల్లుతాడు.
అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు.
అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు.
అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు, ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము.
కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు.
దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

*ఐదు కనుమలు !*

*కనుమ నాడు కాకి కూడా ప్రయాణం కాదు. …*
*మనకు ఉన్నవి ఐదు కనుమలు*

సంప్రదాయంగా ఐదు కనమలలో ప్రయాణం చేయరాదని అంటారు.
కనుమ నాడు కాకైనా
బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం.

*”శవదాహే గ్రామదాహే సిపిండీకరణే తథా*
*శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని”*

శవందహనం జరిగిన మరుసటి రోజు ,

గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు ,

సపిండీకరణమైన మరుసటి రోజు ,

గర్భస్రావం మరుసటి రోజు

సంక్రాంతి మరుసటి రోజు , వీటిని కనుమలు అంటారు.

ఈ రోజుల్లో ప్రయాణించరాదు.

కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయని పురాణ వచనం…

సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు.

దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని… గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత…

గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే..

మీరు 7 , 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి , కొద్దీగా బెల్లం , కొన్ని తేనె చుక్కలు , కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం , పంచమ రాహు , అష్టమ రాహు , రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది.

అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు.

కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత… మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకునవలేను…

*_🍃శుభమస్తు🍃_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏