నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 18 – 01 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : అష్టమి రా1.12 వరకు,
నక్షత్రం : రేవతి ఉ8.28 వరకు,
యోగం : సిద్ధం రా7.31 వరకు,
కరణం : విష్ఠి మ2.10 వరకు,
తదుపరి బవ రా1.12 వరకు,

వర్జ్యం : తె3.25 – 4.56,
దుర్ముహూర్తము : ఉ10.19 – 11.03 &
మ2.45 – 3.30,
అమృతకాలం : ఉ7.43 వరకు,
మరల రా12.24 -1.55,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండo : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మీనం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.43,

*_నేటి మాట_*

*ఏ దైవాన్ని పూజించాలి??? – ఏ దేవుడి నామస్మరణ చేయాలి???…*

ఏక, రూప నామారాధన ఉత్తమం…
భగవంతుడు అనేక రూపాలలో, అనేక నామాలతో భక్తులచే ఆరాధింపబడుతున్నాడు…
అన్ని నామములు, అన్ని రూపములు ఆయనవే, సకల మంత్ర, త్రంత స్వరూపుడు, సమస్త విశ్వానికి అధిపతి ఆయనే, అందులో సందేహం లేదు, ఆయన తప్ప సకల చరాచర జగత్తులో మరేదీ స్థిరమైనది కాదు…

అందుకే… “అనంత నామధేయాయ, సర్వాకార విధాయనే సమస్త మంత్ర వాచ్యాయ, విశ్వైక పతయేనమః” అంటూ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంటాం.
అయితే, అన్ని రూప, నామములు ఆయనవే అయినా… భక్తులు తమకు ప్రియమైన ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఎంపిక చేసుకొని ప్రగాఢ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు…
ఏకోన్ముఖం చేయటం వల్ల భక్తిలో గాఢత, తీవ్రత, సాంద్రత పెరుగుతాయి.
భక్తులు మైమరచి దైవారాధన చేయగల స్థితి సంప్రాప్తిస్తుంది, ఫలితం సత్వరంగా అందుతుంది, భూతద్దంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చేసి, ఆ వెలుగు ఒక కాగితంపై కేంద్రీకృతం చేస్తే ఉష్ణం జనించి కాగితం కాలిపోయే స్థితి వస్తుంది.
సూర్యకాంతి కేంద్రీకృతం కావడం వల్లనే ఇలా జరుగుతుంది, భక్తి కూడా అంతే…
కానీ.. కొంతమంది వారంలో ఒక్కోరోజునూ ఒక్కో దేవుడికి కేటాయిస్తారు.
సోమవారం శివారాధన, మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ, గురువారం సాయీబాబా గుడికి వెళ్లడం, శుక్రవారం అమ్మవారి ఆలయానికి, శనివారం వేంకటేశ్వర స్వామి కోవెలకు వెళ్లి దర్శనం చేసుకోవటం వంటివి చేస్తుంటారు.
అన్ని రూప నామములూ శక్తిమంతమైనవే అయినా మనకున్న కొద్దిపాటి కాలాన్ని, శక్తిని, భక్తిని ఇలా అనేక దైవరూపనామాలుగా పంచడం సరియైున విధానం కాదు…

*భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిన సూక్తి స్మరణీయం…!!!*

పట్టినదేదియో పట్టనేపట్టితివి,
పట్టు నెగ్గుడు దాకా అట్టె ఉండు

కోరినదేదియో కోరనే కోరితివి,
కోర్కె చెల్లెడిదాక కొలచియుండు

అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినదిడుదాక అట్టె ఉండు
తలచినదేదియో తలచనే తలచితివి,
తలపు తీరెడుదాకా తలరకుండు

పోరుపడలేక తానైన బ్రోవవలయు
ఒడలుతెలియ నీవైన ఉడుగవలయు

అంతియేగాని మధ్యలో మరలిపోవుట భక్తుని లక్షణముగాదు…

చిరస్మరణీయులైన అనేక మంది మహాభక్తుల చరిత్రను పరిశీలించినా ఒకే రూపనామాన్ని అంటి పెట్టుకొని ఉండి జన్మ సాఫల్యం చేసుకోవడం మనకు కన్పిస్తుంది… రోమరోమానారామనామాన్ని పలికించిన ఆంజనేయస్వామి చిరంజీవియైు, తానే దైవం స్థాయికి ఎదిగి లోకానికి పూజనీయుడైనాడు…

కలియుగంలో కూడా త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, జ్ఞానదేవ్‌, నామదేవ్‌, చైతన్యమహాప్రభు, సక్కుబాయి, మీరాబాయి వంటి మహాభక్తులు ఒకే రూపనామాలను ఆరాధించి ధన్యజీవులైనారు…
కనుక మనమంతా మనకు ప్రీతిపాత్రమైన రూప నామాన్ని ఎంపిక చేసుకొని అనునిత్యం ప్రార్థిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ ధన్యులమవ్వాలి… 🙏

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏