నేటి పంచాంగం.. నేటి విశేషం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 20 – 02 – 2024,
వారం … మంగళవారం భౌమవాసరే
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – శుక్ల పక్షం,

తిథి : ఏకాదశి మ12.04 వరకు,
నక్షత్రం : ఆర్ద్ర మ2.22 వరకు
యోగం : ప్రీతి మ2.00 వరకు,
కరణం : భద్ర మ12.04వరకు,
తదుపరి బవ రా12.22 వరకు,

వర్జ్యం : రా2.58 – 4.38,
దుర్ముహూర్తము : ఉ8.46 – 9.33,
మరల రా10.59 – 11.48,
అమృతకాలం : లేదు,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.29,
సూర్యాస్తమయం: 5.58,

*_నేటి విశేషం_*

*భీష్మ ఏకాదశి*
*భీష్మ ఏకాదశి విశిష్టత..*
భీష్ముడు మోక్షం పొందిన రోజు, మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం♪.
ఈ రోజున నారాయణార్చన, శ్రీవిష్ణుసహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేషఫలాలను ఇస్తాయి♪.
భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి” అని పిలుస్తారు♪.

గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది♪.
అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు♪.
జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది♪.
అంటే, గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు♪.
అయితే, శాపవశాన ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు♪.
అందుకని ఆ పిల్లవాడిని తీసుకుని, ఆయనను వదలి ఆమె వెళ్ళిపోయింది♪.
అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు♪.
ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది, సత్యాన్ని అది ధరించి ఉంటుంది♪.

*భారత యుద్ధంలో 11 రోజుల తర్వాత…*
భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు♪.
ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగమే “శ్రీ విష్ణు సహస్ర నామం”.
శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట♪.

*భీష్ముడి ప్రత్యేకతలు*

అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర♪.
శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే♪.
చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే♪.
తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు♪.
యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి, కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు♪.

కాని, భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కు అయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారే మో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు♪.
తన తమ్ములు చనిపోయిన తర్వాత గూడా, తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు♪.

*శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు*
శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్దిమందిలో భీష్ముడు ముఖ్యుడు♪.
తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు♪.
భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు♪.

అష్టవసువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు, భీష్మాచార్యుడు♪.
కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణంకోసం వేచి ఉన్నాడు♪.
తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు♪.

58 రోజులు అంపశయ్యపై…

58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథి కోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు♪.
అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు♪.
అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం.
అనంతరకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు♪.
ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం♪.

మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదించాడు♪.
మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది♪. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని “భీష్మ ఏకాదశి”, “మహాఫల ఏకాదశి”, “జయ ఏకాదశి” అని అంటారు♪.

విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా….
విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది♪.
ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది♪.
అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి♪. భోగభాగ్యాలు కలుగుతాయి♪. సర్వ పాపాలూ హరిస్తాయి♪. పుణ్యగతులు లభిస్తాయి♪.
అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది♪…

ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం,
*”శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే” అనే శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని వివరించాడు♪.*
ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే….

” శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే”
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే”

అనే శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.

*_☘️శుభమస్తు☘️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏