నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌾పంచాంగం🌾
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 28 – 02 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
మాఘ మాసం – బహళ పక్షం,

తిథి : చవితి రా1.05 వరకు,
నక్షత్రం : చిత్ర పూర్తి
యోగం : గండం మ3.13 వరకు,
కరణం : బవ మ12.14 వరకు,
తదుపరి బాలువ రా1.05 వరకు,

వర్జ్యం : మ2.04 -3.49,
దుర్ముహూర్తము : ఉ11.49 – 12.35,
అమృతకాలం : రా12.34 – 2.19,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.24,
సూర్యాస్తమయం: 6.01,

*_నేటి విశేషం_*

*సంకష్టహర చతర్థీ వ్రతము*
మనకి భాద్రపదమాసంలో శుద్ధచతుర్థినాడు మాత్రమే వినాయకపూజ చేసే అలవాటున్నది.
వాస్తవానికి ప్రతినెలలో వచ్చే రెండు చతుర్థులూ వినాయకుని పూజ చేయాలి…
పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ చతుర్థినాడు చేసే వినాయకపూజను సంకష్టహర చతుర్థినాడు చేసే వినాయకపూజను సంకష్టహర చతుర్థి అని వ్యవహరిస్తారు.

ఈ అర్చన అన్నిరకముల కష్టములను పోగొట్టి శుభ లాభములను కలిగించును…

రాత్రికి చతుర్ధివున్ననాడు యీవ్రతాన్ని చేయాలి. పగలు ఉపవాసంవుండి, గరిక, మారేడు, పుష్పములతో-షోడశోపచారపూజ చేయాలి.

గణపతికిష్టమైన ఉండ్రాళ్లు మొదలైన వానిని నివేదించవలెను.
గణపతికి చంద్రునికి చతుర్థీ తిధికి రోహిణీ నక్షత్రానికి అర్ఘ్యం యీయవలెను.
ఈ అర్చన ఉదయపూజ, పగటి ఉపవాసము, రాత్రి పూజ కలిగినది.

శ్రీ మహాగణపతికి సంబంధించిన ఉపాసన, మంత్రతంత్ర విధానాలు వైదికసాహిత్యం మొదలుకొని బహుళ వ్యాప్తమయ్యాయి. ‘గాణాపత్యం’ అనేది సుప్రసిద్ధం.
గణపతి అనుగ్రహంచేత సర్వకార్యాలూ సానుకూలమవుతాయి.
అన్ని సంకటాలూ దూరమవుతాయి, అందులో సందేహంలేదు.
కలియుగంలో గణపతి, దుర్గ-వెంటనే అనుగ్రహించే దేవతలు అని శాస్త్రవచనము (కలౌ చండీ వినాయకౌ).

‘చతుర్థీపూజనప్రీతః’ అని గణపతి నామం.

చతుర్థీ (చవితి) తిథి గణపతికి ప్రీతి.
ఆ తిథినాడు ఆయన ఉద్భవించాడు.
సృష్టిహేతువైన ‘పరబ్రహ్మం’ ఒక్కటే, అదే జగత్కల్యాణార్ధమై గణపతిగా, విష్ణువుగా, శివునిగా, శక్తిగా, సూర్యునిగా, స్కందునిగా వివిధరూపాలు ధరించింది.

ఒక్కోనామం, ఒక్కొరూపం, వాటి ఉపాసనా విధానం ప్రత్యేక ఫలాలనిస్తాయి.

భాద్రపదశుద్ధ చవితి ‘వినాయక చవితి’గా మనం గణపతిని పూజిస్తాం.
కానీ ప్రతిచవితి గణపతికి ప్రీతికరమే.
భాద్రపదశుక్ల చవితి-గణపతిపార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా అవతరించిన రోజు.
కాని అంతకుముందే గణపతి ఉన్నాడు, ఆయన ఉపాసన ఉంది.
బ్రహ్మదేవుడు సృష్ట్యాదిలో సృష్టి నిర్వహరణకు కలిగే విఘ్నాలనుచూసి భీతిల్లి, పరబ్రహ్మను ప్రార్ధించాడని చెబుతారు…

ప్రణవ (ఓంకారం) స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాలను నశింపజేసేందుకు గజవదనరూపంతో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాలను హరింపజేశాడు. ఇది ప్రథమ ఆవిర్భావం.

వక్రతుండస్వరూపం, అనేకానేక అవతారాలుగా గణపతి రూపాలు బహువిధాలు అని పురాణ వాఙ్మయం తంత్రశాస్త్రం వివరిస్తోంది.

సర్వ దారిద్ర్యాలు, భయ , రోగాది కష్టాలూ హరింపజేసే గణపతికి ప్రీతికరంగా చతుర్థీవ్రతం అని చెప్పారు.

ముఖ్యంగా ‘కృష్ణపక్షం’లో వచ్చే ‘చతుర్థి’ చాలా ముఖ్యం.
ప్రతినెలా ఆ చతుర్థికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో, లేదా ఉండ్రాళ్లు మోదకాలు వంటివి నివేదించడమో చేయాలి.
కృష్ణ చతుర్థినాడు దూర్వలతో, బిల్వాలతో, పుష్పాలతో గణపతిని అర్చించి, ఏకవింశతి (21) ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలూ, గృహదోషాలు, అన్ని యీతి బాధలూ తొలగుతాయి..

ఈ కృష్ణచతుర్థులలో-ప్రముఖమైనదీ, మహామహిమాన్విత మైనదీ…. మాఘ మాసంలో- అంటే ఈ నెలలో వచ్చే కృష్ణచతుర్థి. 
కృష్ణచతుర్ధి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి.
ఆరోజు ఉదయాన్నే లేచి – గణపతిని స్మరించి, “ఈరోజున నీవ్రతాన్ని చేయదలచుకున్నాను” అని సంకల్పించుకొని, స్నానాది నిత్యనైమిత్తిక కర్మలుచేసి, గణపతి స్తోత్రంతో, ధ్యానంతో, స్మరణతో గడపాలి.
ఉపవాసం పూజ చేయడంకూడా ఉత్తమం, సాయంత్రం చంద్రోదయంతో గణపతిని షోడశోప చారాలతో పూజించి, ఉండ్రాళ్లు, లడ్లు, మోదకాలు, బెల్లం కలిపిన పదార్ధాలు శక్త్యాను సారం నివేదించాలి.

పూజానంతరం-శాంతచిత్తాన ‘శ్రీగణేశాయనమః’ అనేనామాన్ని 21 సార్లు జపించాలి.
గణపతి మంత్రోపదేశం ఉన్నవారు ఆఉపదేశమంత్రాన్ని జపించాలి.

శ్లో॥ గణేశాయ నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక సంకష్టహర మే దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే కృష్ణపక్షే చతుర్ధ్యాంతు సంపూజిత విధూదయే క్షిప్రం ప్రసీద దేవేశ గృహాణార్ఘ్య నమోస్తుతే॥   1

పై శ్లోకాలు చదివి “సంకష్టహరణ గణపతయే నమః”అని చెప్పి రెండుసార్లు అర్ఘ్యమివ్వాలి. తరువాత-ఈక్రింది మంత్రంతో ‘చతుర్థి తిథి అధిష్ఠాత్రీదేవీ’కి అర్ఘ్యమివ్వాలి.

శ్లో॥ తిథీనాముత్తమే దేవి గణేశప్రియవల్లభే సర్వసంకట నాశాయ గృహాణార్ఘ్యం నమోస్తుతే॥ ‘చతుర్ధ్యై నమః’ ఇదమర్ఘ్యం సమర్పయామి ll 2

తరువాత ఈ క్రింది మంత్రంతో చంద్రునికి చందన కుసుమాక్షతలు, పెరుగు కలిపిన రాగిపాత్రలోని నీటిని అర్ఘ్యం ఇవ్వాలి.

శ్లో॥ గగనార్ణనమాణిక్య చంద్ర దాక్షాయణీపతే। గృహాణార్ఘ్యం మయాదత్తం గణేశప్రతిరూపక॥   3

ఈ చవితినే ‘సంకష్టహర చతుర్థి’లేదా ‘వక్రతుండ చతుర్ధి’అంటారు.

‘యం యం కామయతే యోవైతం తమాప్నోతి నిశ్చితం అని పురోణోక్తి.

ఏ కోరికతో ఈ వ్రతాన్ని చేస్తే, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.

శ్రీ మహాగణపతియే నమః 🙏🌺

*_🌾శుభమస్తు🌾_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏