నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 24 – 03 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం,

తిథి : చతుర్దశి ఉ9.28 వరకు,
నక్షత్రం : పుబ్బ ఉ7.21 వరకు,
యోగం : గండం రా8.19 వరకు,
కరణం : వణిజ ఉ9.28 వరకు,
తదుపరి విష్ఠి రా10.32 వరకు,

వర్జ్యం : మ3.21 – 5.07,
దుర్ముహూర్తము : సా4.30 – 5.18,
అమృతకాలం : రా2.00 – 3.46,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.07,
సూర్యాస్తమయం: 6.07,

*_నేటి విశేషం_*

*కామదహనం – ఫాల్గుణ శుద్ధ చతుర్దశి*

సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిన తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి , భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని , గర్వాన్ని అణిచాడు.

ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.
అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసినదనీ శివుడు భార్యాహీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు.

భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని తానిక అమరుడినని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు , జనులు , ఋషులను బాధించసాగాడు.

పర్వతరాజు హిమవంతుడు , మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేస్తారు.
వారి తపానికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా *” నీవే మాకు పుత్రికగా రావాలి! “* అని కోరతారు.
సరెనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది.

శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు.
హిమవంతుని పుత్రికయైన హైమావతి చిన్ననాటి నుండే అపరశివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది.
హిమాలయాలలో తపములోనున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది, కానీ తపములోనున్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.

*యాలలు:*
*అంబికాదేవి యంతాలో హరుని సాన్నిధ్యముకే తెంచి*
*సంబరమున ప్రాణేశునిజూచి యో మౌనులారా !*
*చాల భక్తి గలిగి మ్రొక్కేనూ*
*దినదినా మీరితి గౌరి దేవి పూజజేసి పోంగ ఘనుడు*
*శంబుడి సుమంతైననూ ఓ మౌనులారా !*
*కానడు బ్రహ్మానందమువలనా*

ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు , నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు. అప్పుడు అందరూ కలిసి పార్వతీశివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడుదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు. నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివునకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి బాటలు వేయమని ఆదేశిస్తాడు. శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞవలన చేసేది లేక సరేనంటాడు.

*గద్యం:*
*అమరాధిపునిజేరి యానారదుండి*
*విమలుడీవిధమెల్ల వినిపించగాను*
*మంచిదని పృత్రారి మన్మథున్జూచి*
*యెంచి సహాయము లిడి బ్రతిమాలి*
*కాలకంఠునిజేరి కాచుకోనియుండి*
*బాలపార్వతి మీద భ్రమనొందజేయు*
*మనుచు సురపతి పయన మంపేటివేళ*
*కనుగొని కాముని కాంత యిట్లనియె.*

తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన మన్మథుడి భార్య రతీదేవి మన్మథుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు.

*మ. రతియిటెంతయు జెప్పినన్ వినక* *మూర్ఖంబొంది యామన్మధుం*
*డతిగర్వించి వసంత మధవునిలో నావేళతా* *వేళ్ళుచున్*
*శితికంఠున్ని* *పుడేమహామహిమచే స్త్రీలోలునింజేసి యా*
*వ్రతనేమంబున భంగపుత్తునని యా ప్రాంతంబునం జేరినన్*

వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మథుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు. ఆ బాణాలవలన శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపరచినది ఎవరు అని కృద్ధుడై అన్ని దిక్కులా పరికించిచూడగా ఓ మూలన భయపడుతూ కనబడతాడు మన్మథుడు. వెంటనే రుద్రుడై మూడోకన్నును తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.

*ద్వి. విరహకంటకుడట్లు వేగానజూచి*
*హరమూర్తినిటలాక్ష మదిదెర్వగాను*
*ప్రళయానలముబట్టి పారేటివేళ*
*బలువైనకాముండు భస్మమైపోయె*
*పసలేకరతిదేవి పడిమూర్చబోయె*
*కుసుమ శరుడు భీతి గొని పారిపాయె*

*ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు.* ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు. తెల్లవారి హోళిపండుగగా , కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు. అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోళి అని అంటారు…

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏