Neti panchangm. నేటి పంచాంగం..

🪻పంచాంగం🪻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 09 – 2023,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం – బహళ పక్షం,

తిథి : అమావాస్య ఉ6.07 వరకు,
తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి,
నక్షత్రం : ఉత్తర పూర్తి
యోగం : శుభం తె4.46 వరకు,
కరణం : నాగవం ఉ6.07 వరకు,
తదుపరి కింస్తుఘ్నం రా7.00వరకు,

వర్జ్యం : మ1.04 – 2.50,
దుర్ముహూర్తము : ఉ8.17 – 9.05 &
మ12.20 – 1.09,
అమృతకాలం : రా11.37 – 1.22,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 5.51,
సూర్యాస్తమయం: 6.02,

*_నేటి విశేషం_*

*భాద్రపద మాసం ఆరంభం….!!*

చాంద్రమాన గణన ప్రకారం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చే మాసానికి ‘భాద్రపద మాసం’ అని పేరు.
ఈ సమయంలో సూర్యుడు సింహం, కన్యా రాశుల్లో సంచరిస్తుంటాడు.
ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే సమయం ఇది, నూతన కార్యక్రమాలైన గృహారంభ, గృహ ప్రవేశ, వివాహాదులకు ఈ నెల పూర్తిగా నిషిద్ధం.
వానల ప్రభావం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల ప్రభావంతో అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలుతుంటాయి.
ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో శక్తిహీనులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది.
రోగ నిరోధకశక్తి ఉన్నవాళ్లు తట్టుకొని నిలదొక్కుకుంటారు అందుకే, ఈ నెలలో అందరూ శక్తి ఆరాధన, జపాలు, ఉపాసన చేస్తూ ప్రకృతి వ్యతిరేక శక్తులను అధిగమించాలని చెబుతారు…

ఈ మాసంలో …
హరితాళిక,
గణేశ చతుర్థి,
రుషి పంచమి,
లలితా షష్ఠి,
లలితా సప్తమి,
రాధాష్టమి,
అవిధ నవమి,
దశావతార వ్రతం,
పరివర్తిని ఏకాదశి,
వామన ద్వాదశి,
అనంత పద్మనాభ చతుర్దశి,
విషశహత మహాలయం …
వంటి అనేక వ్రతాదులు ఆచరించాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది.
ఈ వ్రతాలన్నీ తమను తాము తీర్చిదిద్దుకునేందుకు వినియోగించుకునేవే…

శారీరకంగా, మానసికంగా, ఆహార పరంగా లోపాలు రాకుండా కాపాడుకోవడమే వీటి ఉద్దేశం.
ఈ వ్రతాలన్నీ పెద్దవే! నిర్వహణ కూడా శ్రమతో కూడుకున్నదే.
అయినా, మన వారు వీటిల్లో చాలా వ్రతాలను వారి వారి ప్రాంతాచారాలను బట్టి నిర్వహిస్తూనే ఉంటారు…

మనసును రోగమార్గం, భోగమార్గం వైపు మళ్లించకుండా ఆధ్యాత్మిక శక్తిమార్గంపై కేంద్రీకరించడానికే వ్రతాలు ఆచరించాలని సూచించారు పెద్దలు.

తద్వారా శక్తిని పెంపొందించు కొని సమస్యలను అధిగమించవచ్చు…

భాద్రపద మాసంలో భూమికున్న గురుత్వాకర్షణ శక్తికి, చంద్రుని ఆకర్షణ శక్తికి మధ్యవ్యత్యాసాలుఏర్పడుతాయి.
వాటిని అధిగమించేందుకు గణేశ నవరాత్రులు నిర్వహిస్తుంటారు.

గణేశుడంటేనే భూమ్యాకర్షణ శక్తి, భూమితో సాన్నిహిత్యాన్ని పెంచుకొని గురుత్వాకర్షణశక్తిని ఉపాసించే అవకాశం కల్పిస్తాయి వినాయక నవరాత్రులు…

గణేశ వ్రత కథ కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టంగా సూచన చేస్తుంది.
చంద్ర ప్రభావం వల్ల భూమివాతావరణంతో పాటు మన మనస్సులు సంచలనం పొందుతాయి.
కాబట్టి మరింతగా మూలశక్తి చైతన్యాన్ని ఉపాసించమని భాద్రపదం సూచిస్తుంది…
భాద్రపద బహుళ పక్షం పితృదేవతల పక్షంగా చెబుతారు.
తరలిరాని లోకాలకు వెళ్లిన మన పూర్వీకులను తలుచుకునే అవకాశం కల్పిస్తుంది భాద్రపదం.
పితృదేవతలను స్మరించుకుంటూ, వారికి ఉత్తమగతులు రావాలని కోరుతూ దానధర్మాలు చేస్తుంటారు.
తగిన విధమైన సంప్రదాయ కర్మలు నిర్వర్తిస్తారు.
మాసం చివరి రోజైన మహాలయ అమవాస్యనాడు పితరుల పేరుమీద శక్తిమేరకు దానధర్మాలు చేస్తుంటారు.

లోక వ్యవహారంలో శుభకార్యాలకు పనికిరాని సమయాన్ని ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి.
ఈ సమయంలో దైవధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మిక జీవనమార్గంలో ముందుకుసాగాలని చెబుతారు…
ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవాలి.
వరుస శుభకార్యాలు ఉండే కాలంలో మనిషి దైవారాధనపై అంతగా దృష్టి సారించలేడు.
ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించు కోవడానికి శూన్య మాసాలే సరైనవని చెబుతారు పెద్దలు.

భాద్రపదం అలాంటిదే! దాదాపు శుక్లపక్షం అంతా వినాయక ఉత్సవాలతో ఆధ్యాత్మిక తరంగాలు వీధివీధినా ప్రసరిస్తుంటాయి.
పితృదేవతా ఆరాధనతో కృష్ణ పక్షం ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి అనువైన మాసంగా భాద్రపదం ప్రత్యేకతను సంతరించు కుంది. ఈ నెలలో శక్తిని ఉపాసిస్తూ శక్తిమంతులం అవ్వాలి.
భారతీయ ధర్మం నిర్దేశించినట్టుగా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించడమే మనకు శ్రేయోదాయకం…

_🪻శుభమస్తు🪻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏