మహాకవుల సాహిత్య కథలు-4

మహాకవుల సాహిత్య కథలు-4

*రోకలి చిగురించింది*
(ముసల: కిసలాయతే)

ఒకప్పుడు ‘అన్నంభట్టు’ అనే పేరున్న ఒక విద్యార్థి ఉండేవాడు. అతనికి పెద్దగా చదువు ఒంటబట్టేది కాదు. ఏదో ఎలాగో వేదవిద్య పూర్తయిందని పించాడు. వివాహానికి తగిన వయసురాగా, తలిదండ్రులు మంచి శ్రోత్రియుని కూతురూ, సంస్కృతంలో కవిత్వం కూడా చెప్పగల పిల్లతో అతనికి పెళ్లి జరిపించారు.

ఆమె తలిదండ్రులూ ఆమె కూడా వీలయినంత ఎక్కువగా సంస్కృతంలోనే మాట్లాడుకుంటూ ఉండడం, కనీసం పెళ్లిపీటలమీద కూడా సంస్కృతాన్ని విడవకపోవడం కారణంగానూ – ఆ భాష తనకంతగా రాని
కారణంగానూ- కొంత అర్థమయ్యీ, కొంత కాకా అన్నంభట్టుకి పెద్దతలనొప్పిగా అన్పించింది వారి ధోరణి. అయినా ‘ఏం చేస్తాం?’ అనుకున్నాడు అన్నంభట్టు

అప్పటికి.
మూడు నిద్రలకి అత్తవారింటికి వెళ్లాడు అన్నంభట్టు. ఏమైనా
ఈ మూడు రోజుల్లోనూ సంస్కృతాన్ని నేర్చేసుకోవాలనే పట్టుదల అతణ్ణి గట్టిగా పట్టింది.

తనకి వేదమైతే కంఠస్థంగా వచ్చు. అయితే సంస్కృతభాష మాత్రం రాదు. అలా రాకపోవడం ఇక్కడ ఇబ్బందై కూర్చుంది. ఈ కారణంగా అత్తవారి ఊరుని చూస్తున్న వంకతో ఊరంతా తిరిగి మొత్తానికి ఒక మహావిద్వాంసుణ్ణి తనకి సంస్కృత గురువుగా ఎంచుకున్నాడు.

అయితే ఆయన ఉండే చోటు, తమ నివాసానికి కొద్ది దూరం. అయితేనేం ? ఏదో ఒక అండగా ఉండి సంస్కృతాన్ని చెప్తానన్నాడుగా ! అదే పదివేలనుకుని, రోజులో ఎక్కువ సేపు ఆయన వద్దనే గడపసాగాడు.

అన్నంభట్టుకి మరీ ఇబ్బంది ‘భోజనాల వేళ’ లోనే.

అన్నమ్- భక్ష్యమ్ – చోష్యమ్ (పులుసు) – సూప: (పప్పు) – శాకమ్ (కూర) – దధి (పెరుగు) –
తక్రమ్ (మజ్జిగ) వంటి పదాలని మొదట రోజునే నేర్చుకుని, వాటిని బాగా గుర్తుంచుకుని రెండోరోజు భోజనాల వేళలో ‘అన్న మానీయతామ్ (అన్నం పట్రండి) చోష్యం దీయతామ్ ‘(పులుసు పొయ్యండి . … అంటూ ముక్తసరిగా వాక్యాలని మాట్లాడ్డం మొదలెట్టాడు.

ఆ వాక్యాలని మాట్లాడుతున్న తీరుని బట్టి, తన భర్తకి సంస్కృతం వచ్చి మాట్లాడుతున్నాడా ? లేక ఏవో కొన్ని వాక్యాలని మాత్రం ముక్కున పట్టుకుని చిలకపలుకుల్లా ఈ సమయంలో అప్పగిస్తున్నాడా ? అనే విషయం, సంస్కృత పండితురాలు కావడం మూలాన ఆమెకు ఇట్టే అర్థమైపోయింది.

తమ ఇంటికొచ్చాక సంస్కృతంతో ఇబ్బంది పడలేక, తన భర్త మెల్లగా సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తితో ఉన్నాడనే విషయం గ్రహించిన ఆమె
వెటకారంగా కాక, సన్నని పరిహాసం చేస్తూ ‘ముసలః కిసలాయతే’ అంది.

అంతే ! భోజనం చేసినంతసేపూ ‘ముసలః కిసలాయతే’ అనే
వాక్యాన్నే అనుకుంటూ తొందరగా భోజనాన్ని ముగించిన అన్నంభట్టు ఆ విద్వాంసుని వద్దకి వెళ్లి చెప్పాడు. ఆయన నవ్వుతూ ‘రోకలి చిగురుస్తోంది’ అని దీని అర్థం అని చెప్పాడు.

అన్నంభట్టుకి తన భార్య చేసిన వేళాకోళం చాల మనస్తాపాన్ని
కల్గించింది. ఎప్పటికైనా తన భార్య, మామలకంటే మించిన పాండిత్యాన్ని పొంది
ఆ మీదటే తన మొహాన్ని వాళ్లకి చూపించాలని నిశ్చయించుకున్నాడు.

ఎక్కడికి
వెళ్లిందీ, ఎందుకు వెళ్లిందీ కూడ ఎవరికీ తెలియనీయరాదని భావించి మఱునాడే కాశీకి ఒంటరిగా రహస్యంగా వెళ్లిపోయాడు.

మహావిద్వాంసులైన కాశీ పండితుల సన్నిధిలో పదిహేను సంవత్సరాల పాటు నాలుగు శాస్త్రాలని అభ్యసించాడు. ఆ నాల్గింటిలోనూ కూడా ఆయనకి తర్కశాస్త్రం మరింత నచ్చింది. దానితో తర్కంలో మహాపండితుడనే ఖ్యాతిని కాశీలోనే ఆర్జించాడు. తనమీద తనకి నమ్మకం కుదిరాక తన భార్య ఉన్న గ్రామానికి వచ్చాడు. అప్పుడు కూడా తానెవరో ఎవరికీ చెప్పలేదు.

పదిహేను సంవత్సరాల క్రితానికీ ఇప్పటికీ రూపంలో రంగులో వయసులో మాట పట్టుబడిలో మార్పుండటమే కాక పాండిత్యంతో నిండిన ఈ పండితుణ్ణి చూసి ‘ఆ అన్నంభట్టే ఇతడని ఎవరూ కనీసం ఊహించలేక పోయారు.

తర్కంలో గట్టిపండితులు శాస్త్రవాదానికి వచ్చారని గెలవదలచిన వారు వచ్చి వాదించవచ్చుననీ ఊరంతా చాటింపు వేసారు.

అందఱి పండితుల మధ్యా తన మామగారూ, ఆ ప్రక్కనే తన భార్యా కన్పించారు. వాళ్లకి ఏమాత్రం చెప్పకుండా వెళ్లాననే బాధ అన్నంభట్టుకి క్షణ కాలం కల్గినా, ఏమాత్రం పైకి పొక్కకుండా శాస్త్రవాదాన్ని ప్రారంభించాడు.

‘కాశీకి వెళ్లినవాడూ కాటికి వెళ్లిన వాడూ ఒకటే’ ఆ కాలంలో. అందుకని అన్నంభట్టు ఎక్కడ చదువుతున్నదీ కూడా తెలియని గ్రామస్థులూ పండితులూ, చివరికి భార్యా కూడా ఏమాత్రపు అనుమానాన్నీ వ్యక్తీకరించలేదు.

శాస్త్రవాదంలో పండితులూ, మామా, భార్యా కూడా మొదటి
పదిక్షణాలలోనే ఓడిపోయి తల దించుకుని ‘తమ గురువెవరో సెలవీయవలసిం’దన్నారు అన్నంభట్టుని.

వెంటనే అన్నంభట్టు తానున్న పండిత వేదికని దిగి క్రిందికి వచ్చి భార్యకి దగ్గఱగా నిలబడి, ‘ముసలం కిసలాయతే’ అన్నాడు.ఇంకా
*’గురు ర్భార్యా విపశ్చితి’* ( నా ఈ పాండిత్యానికి గురువు నా భార్యయే) అన్నాడు.

ఆమె ముఖంలో ఆనంద బాష్పాలు గోచరించాయి. తను అన్నమాటలకి, పట్టుదలగా సంస్కృత పండితుడిగా వచ్చిన భర్తను గుర్తించింది. భర్తకి సాష్టాంగ ప్రణామం చేసి తన తప్పుని మన్నించ వలసిందని వేడింది.

దానికి అన్నంభట్టు ‘ప్రియురాలా ! ఆ రోజు ఆ మాటే అనకపోతే ఈ చదువు నాకు వచ్చి ఉండేదే కాదు. చదువు లేనప్పుడు ఎవరైనా అన్నమాట రోషాన్ని కల్గించి ఆ వ్యక్తిని చదువుకునేలా చేస్తుందని ఎవరో చెప్పగా విన్నాను.

అప్పుడు ఆ వాక్యానికి అర్థం తెలియలేదు కాని, ఈ రోజు ఆ విషయాన్ని అనుభవంలో కన్నాను.

చదువురాని కాలంలో ఎవరైనా కించపరిస్తే దాన్ని సరైన తీరులో అర్థం చేసుకుంటే ఇంత లాభం ఉంటుందని గమనించేలా చేసినందుకు కృతజ్ఞుణ్ణి!’ అంటూ ఆమెని తీసుకుని తమ యింటికి వెళ్లాడు అన్నంభట్టు.

‘చదువు రాని విద్యార్థిని గురువు మందలించడమనేది ఆ శిష్యుని బాగుని కోరి మాత్రమే’ అనే సత్యాన్ని గుర్తించిన రోజున గురుశిష్యుల మధ్య ఏ విద్యాలయంలోనూ కలతలే ఉండవు.

అలాగే చదువు సరిగా రాకపోతే అన్నంభట్టులా ప్రయత్నించి సాధించాలనే విషయాన్ని ఇలాటి కథల ద్వారా గమనించి, ఆచరించిన రోజున పరీక్షా ఫలితాలు వెలువడిన పిమ్మట ఆత్మహత్యలూ ఉండవు. కార్యసాధనకి పట్టుదలే అత్యవసరం.

అందుకే ఒక నానుడి ఉంది. ‘కాశీ గమన మాత్రేణ
నాన్నంభట్టాయతే ద్విజ:’
(ఊరికే కాశీ వెళ్లొచ్చినంత మాత్రాన అందఱూ అన్నంభట్టులైపోతారా ? కారు!) అని.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*