నేటి చిట్టికధ…

నేటి చిట్టికధ

చెంచుపల్లి గ్రామంలో దేవయ్య, కాంతయ్య అనే మిత్రులు ఉండేవారు.

కాంతయ్య ఏ పని చేయక సోమరి గా కాలం గడిపేవాడు.
ఎవ్వరి మాట వినక నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు.

దేవయ్య మాత్రం ప్రతి రోజు పనికి వెళ్తూ బాగా సంపాదించుకునేవాడు.

కాంతయ్య ఎక్కడ పడితే అక్కడ అప్పు చేశాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువయ్యేసరికి ఏమి చేయాల్నో కాంతయ్యకు తోచలేదు.

దేవయ్య మాత్రం పని చేసుకుంటూ వచ్చే డబ్బులను కూడబెట్టుకున్నాడు.

కూడబెట్టిన డబ్బుతో అప్పుడో తులం, అప్పుడో తులం బంగారం కొన్నాడు. ఆ బంగారమును జాగ్రత్తగా బీరువాలో దాచుకున్నాడు.

కాంతయ్య దగ్గర ఏమాత్రం దాపరికము లేని దేవయ్య బంగారం కొన్నది బీరువాలో దాచుకున్నది మాటల సందర్భంలో చెప్పాడు కాంతయ్యకు.

ఒక రోజు దేవయ్య భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లారు.

దేవయ్య, కాంతయ్యలు కొంతసేపు అవి ఇవి మాట్లాడుకున్న తరువాత ‘నేను స్నానం చేసి వస్తా కూర్చో’ అని కాంతయ్యతో చెప్పి స్నానాల గదిలోకి వెళ్లాడు దేవయ్య.

అదే అదనుగా భావించిన కాంతయ్య బీరువాలోని బంగారం కాజేశాడు.
బంగారం దొంగలించేటప్పుడు బీరువా తలుపు తీస్తుండగా వేలికి గాయమైంది.

దేవయ్య తరువాతి రోజు బీరువా తీసి చూడగా బంగారం లేదు. లబోదిబోమని గుండె బాదుకున్నాడు.

దేవయ్య పోలీస్ కంప్లైంట్ చేసేసరికి పోలీసులు వచ్చారు. బీరువా తీసి చూస్తున్నప్పుడు దేవయ్య ప్రేమతో పెంచుకున్న కుక్క తోక ఆడిస్తూ బీరువా వద్దకు వచ్చింది.
బీరువాకు అంటిన రక్తాన్ని వాసన చూసి పోలీసుల ప్యాంటు పట్టి లాగసాగింది.
పోలీసులు ఆ కుక్కను వెంబడించారు. అది చక్కగా కాంతయ్య ఇంటికి తీసుకవెళ్లింది. బంగారం ఉన్న దగ్గర ఆగింది. దొరికిన బంగారాన్ని దేవయ్యకు అందించారు పోలీసులు.

కాంతయ్య బంగారం దొంగగా పట్టుబడ్డాడు. స్నేహితుని బంగారము దొంగతనం చేసినందుకు తలదించుకున్నాడు కాంతయ్య.

కాంతయ్యను పోలీసులు పట్టుకువెళ్లారు.

మిత్రద్రోహి స్నేహితుడి కన్న విశ్వాసమున్న కుక్క గొప్పదని తన కుక్కను ప్రేమతో నిమురుకున్నాడు దేవయ్య.

🍁🍁🍁🍁

ఆశ పాపజాతి యన్నిటికంటేను
ఆశ చేత యతులు మొసపొరె
చూచి విడుచువారె సుధ్ధాత్ములెన్దయిన
విశ్వదాభిరామ వినురవేమ!

ఆశా పాశమునకు లోనైనవారు పరమాత్మ పైన ధ్యాస నిలుపలేరు. ఐహిక భోగ భాగ్యాలపైననే వారి ధ్యాస. ఆశ చేయ ఋషులు కూడా మోసగింపబడితిరి. ఎవరైతే ఆశని అతిక్రమించిరో వారు గొప్పవారగుదురు.