22న కలియుగం ప్రారంభం కానుందంటూ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు..!

22న రాం లల్లా విగ్రహావిష్కరణ నేపథ్యంలో అయోధ్యలో కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రామయ్యను దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా రామ భక్తులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు..అయితే రామాలయ ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం నెలకొంది. కాంగ్రెస్ సహా పలు పార్టీల నాయకులు తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. రామ మందిరంలో జీవితాభిషేకం తర్వాత జనవరి 22న కలియుగం ప్రారంభం కానుందంటూ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ వంటి సంస్థలు 1949 నుంచి 1990 వరకు నిష్క్రియంగా వున్నాయని ఉదిత్ రాజ్ పేర్కొన్నారు. మండల్ కమీషన్ వల్లే రామ మందిర నిర్మాణం సాధ్యమైందని ఆయన వాదించారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన ఎల్ కే అద్వానీ నిజమైన ఉత్ప్రేరకమని ఉదిత్ రాజ్ వెల్లడించారు. చారిత్రక అసమానతలను ఎత్తిచూపుతూ, దళితులు చాలా కాలంగా గ్రామాల పొలిమేరల్లో అట్టడుగున వున్నారని.. ఉగ్రవర్ణాల వారు తమ నీడలో కూడా తమను అపవిత్రంగా భావిస్తారని ఉదిత్ రాజ్ దుయ్యబట్టారు…వేలాది సంవత్సరాలుగా దళితులు, వెనుకబడిన తరగతుల దుస్థితిని ఆయన ప్రశ్నించారు. జనవరి 22న వారికి కలియుగం ప్రారంభమవుతుందంటూ ఉదిత్ రాజ్ జోస్యం చెప్పారు. దళితులు, వెనుకబడిన తరగతులకు కొత్తశకానికి నాంది పలుకుతూ రామ మందిరం వద్ద కులవాదులు, రిజర్వేషన్ వ్యతిరేకవాదుల ఉనికిని ఉదిత్ ఊహించారు. అయితే అయోధ్య ప్రాణ్ ప్రతిష్ట విషయంలో ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ట్విట్టర్‌లో ” 500 సంవత్సరాల తర్వాత మనువాద్ తిరిగి వస్తున్నాడు” అంటూ పోస్ట్ పెట్టారు…

ఉదిత్ రాజ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి కౌంటరిచ్చారు. ఈ వ్యాఖ్యలు ‘నఫ్రత్ కి దుకాన్’ (ద్వేషపూరిత దుకాణం)లో కాంగ్రెస్ ప్రమేయాన్ని వెల్లడిస్తున్నాయని దుయ్యబట్టారు. రామమందిరంపై కాంగ్రెస్ అసంతృప్తిగా వుందని, మతపరమైన బుజ్జగింపులకు పాల్పడుతోందని త్రిపాఠి ఆరోపించారు. కాంగ్రెస్ శిబిరం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆయన జోస్యం చెప్పారు. దేశం, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని త్రిపాఠి ఉద్ఘాటించారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఉదిత్ రాజ్ స్పందించారు. తాను రామాలయానికి వ్యతిరేకం కాదని, తన ట్వీట్‌ను మందిర్‌తో ముడిపెట్టొద్దని ఆయన కోరారు..