ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా.. సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు…
జావెలిన్ త్రో ఫైనల్లో సవాలుతో కూడుకున్న పోటీ ఎదురైందని, అయినా ఆత్మ విశ్వాసంతో ఆడానని భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ తెలిపాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ద్వితీయ స్థానంలో నిలిచిన నేపథ్యంలో…రజత పతకం సాధించినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఇక్కడ వాతావరణ పరిస్థితి అంత అనుకూలంగా లేదని, గాలుల తీవ్రత అధికంగా ఉందని చెప్పాడు. ఆటలో తాను ఎలాంటి ఒత్తిడికీ గురి కాలేదని, ప్రతిసారి బంగారు పతకం సాధించడం కుదరదని చెప్పాడు. తాను మూడో ప్రయత్నం తర్వాత కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నానని నీరజ్ చోప్రా తెలిపాడు. ఈ పోటీ తనకు చాలా అనుభవం నేర్పిందన్న నీరజ్.. భవిష్యత్తులో స్వర్ణం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశాడు. ఈ విజయం పట్ల తనకు ఎంతో సంతృప్తిగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ పోటీల్లో పాల్గొన్నవారందరూ బాగా రాణించారని, దీంతో పోటీ తీవ్రంగా మారిందని.. కానీ అది కూడా తన మంచికేనని నీరజ్ చెప్పాడు.