ఇథియోపియా మహిళా తేట తెలుగును చ‌క్క‌గా..అన‌ర్గ‌ళంగా మాట్లాడుతార‌ట‌…!

భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌తో క‌లిసి క‌నిపిస్తున్న మ‌హిళ పేరు ఎర్గోజీ టెస్ఫాయీ. చూడ్డానికి సాధార‌ణ మ‌హిళ‌గానే క‌నిపిస్తున్న ఈమె ఇథియోపియా మ‌హిళా, సామాజిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి. మంత్రిగా ఉన్నా ఆమెకు ఆయా దేశాల ఆచార వ్య‌వ‌హారాలు, సంస్కృతి సంప్ర‌దాయాలపై మ‌క్కువ ఎక్కువే. అందుకే కాబోలు..ఆమె భార‌త ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ కల్చ‌ర‌ల్ రెలేష‌న్స్ (ఐసీసీఆర్‌) అందించే స్కాల‌ర్‌షిప్‌ను సాధించి భార‌త్‌కు వ‌చ్చి మ‌రీ పీహెచ్‌డీ చేశారు.
ఆయా దేశాల సంస్కృతి సంప్ర‌దాయాల‌పై డాక్ట‌రేట్ చేసిన ఆమె మ‌న తేట తెలుగును చ‌క్క‌గా..అన‌ర్గ‌ళంగా మాట్లాడుతార‌ట‌. ఇథియోపియా రాజ‌దాని అడ్డిస్ అబాబాలో నూత‌నంగా నిర్మించిన భార‌త రాయ‌బార కార్యాల‌యం భ‌వ‌న స‌ముదాయం ప్రారంభోత్సవానికి జైశంక‌ర్ బుధ‌వారం అక్క‌డికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎర్గోజీ టెస్ఫాయీ..జైశంక‌ర్‌తో మాట క‌లిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె తెలుగులో బాగా మాట్లాడార‌ట‌. ఇదే విష‌యాన్ని జైశంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆమె ఫొటోతో పాటు ఆమె తెలుగుద‌నం ప‌లుకుల గురించి గొప్ప‌గా అభివ‌ర్ణించారు.