వరల్డ్ కప్ సెమీస్ బెర్తులు ఖరారు.. షెడ్యూల్ ఇదే..

పాక్‌ అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. వరల్డ్‌ కప్‌ సెమీస్‌ రేసులో డ్రామాకు అవకాశమే లేకుండా పాకిస్తాన్‌ కథ కరాచీకి చేరింది. ఇంగ్లండ్‌తో కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడగానే పాక్‌ సెమీస్‌ ఆశలు గల్లంతుకాగా బాబర్‌ సేన ఛేదనకు దిగాక అది అధికారికంగా తేలిపోయింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని 6.4 ఓవర్లలో ఛేదిస్తేనే పాక్‌ నెట్‌ రన్‌ రేట్‌ మెరుగై కివీస్‌ను దాటి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించేది.

కానీ అనిశ్చితికి మారుపేరైనా పాకిస్తాన్‌.. మరోసారి తడబడుతోంది. పాక్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ వికెట్‌ కోల్పోగా 9 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసిన ఫకర్‌ జమాన్‌ కూడా నిష్క్రమించాడు. 6.4 ఓవర్లకు పాకిస్తాన్‌ చేసిన స్కోరు.. 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే. దీంతో పాకిస్తాన్‌ అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించడంతో సెమీస్‌ బెర్తులు ఖాయమయ్యాయి. భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌తో పాటు ఫైనల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ కింది విధంగా ఉంది.

సెమీస్‌ పోరులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు (భారత్‌) నాలుగో స్థానంలో ఉన్న జట్టు (న్యూజిలాండ్‌)తో పోటీపడాల్సి ఉంది. అంటే భారత్‌ – కివీస్‌ల మధ్య మ్యాచ్‌ ఈనెల 15న ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియం వేదికగా తొలి సెమీస్‌ జరగాల్సి ఉంది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య నవంబర్‌ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా రెండో సెమీస్‌ జరుగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజేతలు నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడతాయి…