ఆదిపురుష్ చిత్ర యూనిట్‌పై తీవ్ర స్థాయిలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ విమర్శలు..

ప్రభాస్ కథానాయకుడిగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న విడుదలైంది. అయితే ఈ సినిమా బాగుంది అని కొందరు.. బాగాలేదని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. భారతీయులకు.. ముఖ్యంగా హిందువులకు పవిత్రమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ చిత్రంలో కొన్ని అమర్యాదరకమైన సంభాషణలు ఉన్నాయని.. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విటర్ వేదికగా.. చిత్ర యూనిట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎంతో పవిత్రమైన రామాణయణ గాథను ఆధారంగా చేసుకుని తీసిన ఆదిపురుష్ చిత్రంలో కొన్ని అభ్యంతరకరమైన, అమర్యాదపూర్వకమైన డైలాగ్‌లు ఉన్నాయని.. ప్రియాంక చతుర్వేది ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా హనుమంతుని సంభాషణల్లో అమర్యాదపూర్వకరమైన డైలాగ్‌లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. వెంటనే ఆ డైలాగ్‌లను సినిమా నుంచి తొలగించాలని హెచ్చరించారు. దీనికి గానూ ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓం రౌత్.. సహా మొత్తం చిత్ర బృందం.. భారతీయులందరికీ క్షమాపణలు చెప్పాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. సినిమా పేరుతో మనం పూజించే దేవుళ్లకు భాషను ఆపాదించడం భారతీయులు అందరి మనోభావాలను దెబ్బతీయడమేనని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పొందడం కోసం హద్దులు దాటడం ఆమోదించదగినది కాదని ఆమె ఆరోపించారు.

సినిమా విడుదల
మైథలాజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించారు. సీతగా కృతీసనన్.. రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం రిలీజ్ అయిన ఆదిపురుష్ చిత్రంపై ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సినిమా బాగుంది అని చెబుతుండగా.. మరికొందరు గ్రాఫిక్స్ ఎక్కువైందని.. చాలా కథను మార్చేశారని ఆరోపిస్తున్నారు.