జిల్లాలకు కూడా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రాజన్న సిరిసిల్లకు పాకింది. జిల్లాలోని ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. సదరు వ్యక్తి ఇటీవల దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. కొత్త ఉత్పరివర్తనానికి పాజిటివ్‌గా తేలడంతో హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి ఈ నెల 15న దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.
ఆ తర్వాత ఎయిర్‌పోర్టులో నమూనాలను సేకరించి, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఇవాళ ఫలితాలు రాగా.. ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది. సదరు వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలినట్లు పోత్గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ సంజీవరెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో ఒక్కసారిగా ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య సిబ్బంది గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో పాటు సదరు వ్యక్తి కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు.