పిప్పి పన్ను అనుకోని ట్రీట్‌మెంట్ కోసం ఆస్ప‌త్రికి వెళ్తే ఒమిక్రాన్ ఉన్న‌ట్లు తేలింది…

R9TELUGUNEWS.COM.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తున్న‌ది. విదేశాల నుంచి వ‌చ్చేవారిపై ఎంత నిఘా పెట్టిన‌ప్ప‌టికీ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో క‌రోనా టెస్టులు చేసినప్పుడు నెగెటివ్ వ‌చ్చి.. ఆ త‌ర్వాత కూడా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఈ వేరియంట్ ఒక‌రి నుంచి మరొక‌రికి వ్యాపిస్తుంది. వేరే ఏదో స‌మ‌స్య‌తో ఆస్ప‌త్రికి వెళ్లిన‌ప్పుడు అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. తాజాగా మ‌హారాష్ట్ర‌లో ఇలానే ఒమిక్రాన్ కేసు బయటపడింది. 12 ఏండ్ల బాలిక పంటి నొప్పి ట్రీట్‌మెంట్ కోసం ఆస్ప‌త్రికి వెళ్తే ఒమిక్రాన్ ఉన్న‌ట్లు తేలింది. ఆమెతో పాటు ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధ‌ర‌ణ అయింది..12 ఏండ్ల బాలిక త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి నైజీరియా నుంచి మహారాష్ట్ర‌లోని పింప్రి చించ్వాడ్ జిల్లాకు న‌వంబ‌ర్‌ 24న తిరిగొచ్చింది. విదేశాల నుంచి వ‌చ్చిన స‌మయంలో వారికి ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. దీంతో నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇటీవ‌ల బాలిక‌కు పంటినొప్పి వ‌చ్చింది. దీంతో చికిత్స కోసం స్థానిక డెంట‌ల్ హాస్పిట‌ల్‌కు వెళ్లింది. కానీ అక్క‌డి డాక్ట‌ర్ ట్రీట్‌మెంట్ చేయ‌డానికి నిరాక‌రించాడు. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో క‌చ్చితంగా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆ బాలిక‌.. క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింది. విదేశాల నుంచి రావ‌డం వ‌ల్ల జ‌న్యు ప‌రీక్ష‌లు చేయ‌గా ఒమిక్రాన్ కూడా నిర్ధార‌ణ అయింది. ఆమెతో పాటు వారి కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా ఒమిక్రాన్ నిర్ధ‌ర‌ణ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వారంద‌రినీ జిజామాత ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా అధికారులు వారితో స‌న్నిహితంగా ఉన్న‌వారిని వెతికే పనిలో ప‌డ్డారు…