ఒమైక్రాన్‌తో ఈ టెస్టుకే ప్రజల మొగ్గు.. అధికంగా పరీక్ష రేటు…

ఢిల్లీలో రూ.300 మాత్రమే..
R9TELUGUNEWS.COM.
మార్కెట్లో కిట్‌ ధర రూ.50.సర్కారు నిర్ణయించినది రూ.500…వసూలు చేస్తున్నది రూ.2వేలదాకా…ప్రభుత్వ ల్యాబ్‌ల్లో ఫలితం జాప్యం ప్రైవేటుకు జనం ఇష్టారీతిన చార్జీ…

ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రజలు కొవిడ్‌కు గురవుతున్నారు. టెస్టుల కోసం పరుగు తీస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఫలితం ఆలస్యం అవుతుండడంతో ఎక్కువగా ప్రైవేటు సెంటర్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇదే అదనుగా వాటిలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ మనదగ్గర సర్కారు నిర్ణయించిన ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర అధికంగా ఉంది. దానికిమించి కూడా ప్రైవేటు ల్యాబ్‌లు డబ్బు గుంజుతున్నాయి. కాగా, కొవిడ్‌ తొలినాళ్లలో ప్రైవేటు ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర రూ.2,200గా, ఇంటివద్ద నమూనా తీసుకుంటే రూ.2,800గా ఉండేది. తర్వాత దాన్ని రూ.850కు తగ్గించారు. ఇంటివద్ద శాంపిల్‌కు రూ.1,200 చార్జీ నిర్ణయించారు. ప్రస్తుతం ల్యాబ్‌లో ధర రూ.500గా, ఇంటి దగ్గర నమూనా సేకరిస్తే ధర రూ.800గా ఉంది. కానీ, దీనిని ప్రైవేటు ల్యాబ్‌లు పట్టించకోవడం లేదు.
తెలంగాణలో తగ్గని ధరఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ టెస్టు రేట్లను రూ.500 నుంచి రూ.300కు తగ్గించింది. ఇంటివద్ద నమూనాలు సేకరిస్తే రూ.500 తీసుకోవాలని పేర్కొంది. యాంటీజెన్‌ టెస్టుకైతే ప్రైవేటులో రూ.300 ఉన్న ధరను రూ.100 చేసింది. ప్రైవేటులో ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధరను రూ.350కే చేయాలని మన పొరుగు రాష్ట్రాలు ఉత్తర్వులిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రజలు అదనంగా రూ.200 చెల్లించుకోవాల్సి వస్తోంది. అంతేకాక కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష పేరిట ప్రైవేటు ల్యాబ్‌లు దోచుకుంటున్నాయి. ప్రజల బలహీనతను ఆధారంగా చేసుకుని కొన్ని ల్యాబ్‌లు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఆర్టీపీసీఆర్‌ కిట్లను తయారు చేసే సంస్థలు ఇప్పుడు పెరిగాయి. కిట్‌ ధర రూ.50లోపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెస్టుల ధర తగ్గించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.
యాంటీజెన్‌కు చిక్కని ఒమైక్రాన్‌.. సర్కారీ పరీక్ష కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ నమూనాలను చాలా తక్కువగా సేకరిస్తున్నారు. గతంలో రోజూవారీ కొవిడ్‌ బులిటెన్‌లో యాంటీజెన్‌ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు వివరాలుడేవి. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య వెల్లడించడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో ఇచ్చిన ఆర్టీపీసీఆర్‌ శాంపిల్‌ ఫలితాలు నాలుగైదు రోజులైనా రావడం లేదు. దాంతో ప్రజలు ప్రైవేటుకు వెళ్తున్నారు. పైగా యాంటీజెన్‌ టెస్టుల్లో ఒమైక్రాన్‌ నిర్ధారణ కావడం లేదు. దీంతో ఆర్టీపీసీఆర్‌కు మొగ్గు చూపుతున్నారు. ఇదికూడా ప్రైవేటు ల్యాబ్‌లకు కలిసివస్తోంది. వైద్యశాఖ లెక్కల ప్రకారం 76 ప్రైవేటు ల్యాబ్‌లకే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు అనుమతి ఉంది. కానీ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 600 ప్రైవేటు ల్యాబ్‌లు ఆర్టీపీసీఆర్‌ నమూనాలను సేకరిస్తున్నాయి. జ్వర సర్వేలో ఆర్టీపీసీఆర్‌ చేయాలివైరల్‌ ఫీవరో, కొవిడో తేలియాలంటే రూ.వేలు ఖర్చవుతోంది. కాబట్టి జ్వర సర్వేలో యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలి. ప్రభుత్వ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్యను పెంచి, ఫలితాలను అదే రోజు ఇవ్వాలి. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ధరలు తగ్గించాలి. ప్రైవేటు దోపిడీని అరికట్టాలనీ ప్రజలు కోరుకుంటున్నారు..