ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ కారణంగా పార్లమెంటు ఉభయసభలను వేర్వేరు సమయాల్లో ఏర్పాటు..

R9TELUGUNEWS.COM ఒమిక్రాన్‌ ప్రభావం కారణంగా పార్లమెంటు ఉభయసభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయించారు

. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటలవరకు లోక్‌సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సమర్పణ కోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. అనంతరం 2వ తేదీ నుంచి 11 వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ జరగనుంది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోవడంతో ఆ సభకు సంబంధించిన సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ హాల్‌ నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా రాజ్యసభ, లోక్‌సభ, సెంట్రల్‌ హాల్‌లలో సీట్లు ఏర్పాటు చేశారు.