లోన్​ యాప్​ వేధింపులకు ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..

లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకెళ్తే.. చెన్నైలోని కేకే నగర్కు చెందిన నరేంద్రన్(23) ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.5000 అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించేందుకు మరో లోన్ యాప్ నుంచి అప్పు తీసుకుని పాత లోన్ కట్టేశాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజులకు లోన్ యాప్ సిబ్బంది నరేంద్రన్కు ఫోన్ చేశారు. కొత్తగా తీసుకున్న అప్పు క్లియర్ చేసేందుకు రూ.33వేలు కట్టాలని చెప్పారు. లేదంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో నరేంద్రన్ తన తండ్రి దగ్గర రూ.33వేలు తీసుకుని అప్పు చెల్లిద్దామని చూస్తే.. లోన్ యాప్ సిబ్బంది రూ.50వేల కట్టాలని డిమాండ్ చేశాడు. వారి వేధింపులు తాళలేక నరేంద్రన్ మరో లోన్ యాప్ నుంచి రూ.50వేలు తీసుకుని, పాత లోన్ కట్టేశాడు. కొదిరోజుల తర్వాత లోన్ యాప్ సిబ్బంది మళ్లీ వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. రూ.50వేలు అప్పు తీరాలంటే రూ.80వేలు కట్టాలని చెప్పారు. లేదంటే యువకుడి ఫొటోలు మార్ఫింగ్ చేసి, అతడి ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న అమ్మాయిలకు పంపుతామని బెదిరించారు. వారి వేధింపులతో తీవ్ర ఓత్తిడికి గురైన నరేంద్రన్ సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.