ఓటీటీకి లైసెన్స్.. మెసేజింగ్ యాప్‌లకూ ఇక నేరుగా ఆ సేవలందించడం కుదరదు…!!

ఓటీటీ ప్లాట్ ఫామ్స్, మెసేజింగ్ అండ్ కాలింగ్ సేవలందిస్తున్న యాప్‌లు ఇక నేరుగా ఆ సేవలందించడం కుదరదు. ఇప్పటికే ఓటీటీ సేవలందిస్తున్న అమెజాన్ ఫ్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు.. మెసేజింగ్ కం వీడియో కాల్స్ తదితర సేవలందిస్తున్న వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యూ వంటి యాప్‌లు ఇక ఆ సేవలందించాలంటే టెలీ కమ్యూనికేషన్స్ శాఖ వద్ద లైసెన్స్ తీసుకోవాల్సిందే.ఈ విషయమై కేంద్రం టెలీ కమ్యూనికేషన్స్ బిల్లు-2022 ముసాయిదాను విడుదల చేసింది. దీన్ని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు….బిల్లు ప్రకారం టెలికం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఫీజు మాఫీ చేయొచ్చు. పెనాల్టీ విధించే అధికారం కేంద్రానికి దక్కుతుంది. ఏదైనా సంస్థ తమ లైసెన్స్ సరెండర్ చేస్తే సంబంధిత సంస్థ యాజమాన్యం చెల్లించిన ఫీజు రీఫండ్ చేస్తామని కూడా ముసాయిదా బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. ఈ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలను వచ్చేనెల 20 లోగా తెలియజేయాలని కోరింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్, ఓటీటీ, మెసేజింగ్ కం వీడియో కాలింగ్ సేవలందిస్తున్న యాప్‌లకు లైసెన్స్ ఇవ్వడానికి ఎంట్రీ ఫీజు, లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఫీజులు, చార్జీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ విధించొచ్చు. ఆయా చార్జీలు, ఫీజులు, పెనాల్టీలు రద్దు చేసే అధికారం కేంద్రానికి లభిస్తుంది…లైసెన్సింగ్ పేరిట ఓటీటీ, మెసేజింగ్ యాప్స్‌కు కళ్లెం వేసేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఏ మెసేజ్ అయినా సంబంధిత అధికారి అనుమతి వచ్చిన తర్వాత ట్రాన్స్ మీట్ చేయాలని ముసాయిదా నిబంధనలు చెబుతున్నాయి. లేని పక్షంలో సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి పబ్లిక్ ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ, స్వావలంభన, సమగ్రత, దేశ భద్రత తదితర అంశాల నుంచి మినహాయింపులు ఇవ్వలేదు.