పాలమూరు పార్లమెంట్ ఎన్నికల పరిశీలనలో “రజిని సాయిచంద్”..?..

*రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టాన వ్యూహం*

*పాలమూరు జిల్లాలో సాయిచంద్ కు పెద్ద ఎత్తున అభిమానులు*

ప్రముఖ జానపద గాయకుడు కీర్తిశేషులు సాయిచంద్ భార్య రజనీ సాయిచంద్ పాలమూరు పార్లమెంటు బరిలో నిలిచే విధంగా ఆమె పేరు బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ గాయకుడు దివంగత సాయిచంద్ ఇటీవల హఠాత్ మరణం పాలయ్యారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సాయి కుటుంబానికి అండగా నిలిచారు. పాలమూరు జిల్లాలో మక్తల్ నియోజకవర్గానికి చెందిన సాయి చంద్, జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన రజని ఇరువురిది కులాంతర వివాహం. అన్ని వర్గాల్లో వీరికి ప్రత్యేక ఆదరణ ఆప్యాయత ఉంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్నలను పొందిన సాయిచంద్ హఠాన్మరణం యావత్ తెలంగాణను కన్నీరు పెట్టించింది. ఈ క్రమంలోనే అప్పటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని సాయిచంద్ భార్య రజినీ సాయించంద్ కు కీలక పదవిని ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించగా ప్రభుత్వం అప్పట్లో కార్పొరేషన్ కు చైర్మన్ పదవిని ఇచ్చింది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు సాయిచంద్ అకాల మరణం చెందడం కేసీఆర్‌ను ఎంతగానో కలిచివేసింది.. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని అప్పట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రజని సాయిచంద్ పేరు పాలమూరు పార్లమెంటు ఎన్నికల బరిలో పరిశీలనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం…!