ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లకు శుభవార్త..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్ల గౌరవ వేతనాలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని సహకార సంఘాల వ్యవస్థకు నూతన హెచ్‌ఆర్‌ విధానాన్ని తీసుకురానున్నట్టు సహకారశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు 2019లో టెస్కాబ్‌ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. విధానపరమైన లోపంతో ఇప్పటి వరకు పదవులు, బదిలీలు, వేతనాల విషయంలో సహకార సంస్థల ఉద్యోగులు నష్టపోయారన్న కమిటీ .. అందరికీ ఒకే రకమైన పద్ధతులు, నిబంధనలను నివేదికలో పేర్కొంది. ఈవిధానాల అమలు, సమీక్ష కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్థికంగా బలంగాలేని సంఘాలకు అపెక్స్‌ బ్యాంక్‌, డీసీసీబీల నుంచి 3ఏళ్ల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లకు ఆయా సహకార సంఘాల ఆదాయాలను బట్టి గౌరవ వేతనాలు పెరగనున్నాయి. .సహకార సంఘాల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో పీఏసీఎస్‌ల సామర్థ్యాన్ని బట్టి ఛైర్మన్ల గౌరవవేతనాలు రూ.7,500 నుంచి రూ.15వేల వరకు పెంచాలని ప్రతిపాదించారు. రూ.5కోట్ల టర్నోవర్‌ ఉన్న సంఘాల ఛైర్మన్లకు రూ.7,500, రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్ల టర్నోవర్‌ ఉన్న సంఘాల ఛైర్మన్లకు రూ.10వేలు ప్రతిపాదించారు. రూ.10 కోట్ల నుంచి రూ.15కోట్ల టర్నోవర్‌ ఉన్న సహకార సంఘాల ఛైర్మన్లకు రూ.15వేల గౌరవ వేతనం ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.