ఈ ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ (England)ను ఓడించి పెను సంచలనమే రేపింది అఫ్గానిస్థాన్ (Afghanistan). ఆ విజయం ప్రకంపనలు ఇంకా వినిపిస్తుండగానే మరో సంచలనం సృష్టించింది.
ఆఫ్గాన్ దెబ్బకు పాకిస్థాన్ కుదేలైంది.
ఆఫ్గానిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో ఒకటో రెండో విజయాలు సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు కానీ.. మరీ ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి జట్లను సులువుగా ఓడించేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కొన్నేళ్లుగా అఫ్గాన్ జట్టును అనుసరిస్తున్న వాళ్లకు, ఈ ప్రపంచకప్‌లో వారి ప్రదర్శన చూస్తే… ఇవేవో గాలివాటం విజయాల్లా కనిపించవు…
చెన్నై వేదికగా సోమవారం జరిగిన పోరులో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డేల్లో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 8వ ప్రయత్నంలో పాక్ పై అఫ్గానిస్తాన్ నెగ్గింది. 283 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్ 49 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్ (113 బంతుల్లో 87; 10 ఫోర్లు), రహ్మనుల్లా గుర్బాజ్ (53 బంతుల్లో 65; 9 ఫోర్లు, 1 సిక్స్), రహ్మత్ షా (84 బంతుల్లో 77 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. హష్మతుల్లా షాహిది (45 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు) రాణించాడు.
283 పరుగుల.. ప్రత్యర్థి జట్టులో బలమైన పేసర్లు.. అయినా అఫ్గానిస్తాన్ ను ఆపలేకపోయారు. గెలవాలి అనే సంకల్పంతో ఆడిన అఫ్గానిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ లు తొలి వికెట్ కు ఏకంగా 130 పరుగులు జోడించారు. గుర్బాజ్ వేగంగా ఆడటంతో అఫ్గానిస్తాన్ కు అదిరిపోయే శుభారంభం లభించింది…అనంతరం ఇబ్రహీం, రహ్మత్ షాలు జట్టును ముందుకు నడిపారు. వీరిద్దరు రెండో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రహ్మత్ షా.. కెప్టెన్ హష్మతుల్లాలు ఎటువంటి ఒత్తడికి గురి కాకుండా మిగిలిన పనిని పూర్తి చేశారు. ఈ క్రమంలో షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. అఫ్గానిస్తాన్ జట్టు నుంచి టాప్ 3 బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. టాప్ 4 బ్యాటర్ కూడా త్రుటిలో అర్ధ శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ ఆశలు సన్నగిల్లాయి. సెమీస్ రేసులో ఉండాలంటే ఇకపై ఆడే నాలుగు మ్యాచ్ ల్లోనూ పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లతో పాక్ ఆడాల్సి ఉంది..అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (92 బంతుల్లో 74; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో మెరిశాడు. అబ్దుల్లా షఫీక్ (75 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (38 బంతుల్లో 40; 1 ఫోర్, 1 సిక్స్), ఇఫ్తికర్ అహ్మద్ (26 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ధాటిగా ఆడటంతో పాకిస్తాన్ 282 పరుగులు చేయగలిగింది..