టీ20 వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది పాక్‌. ..

టీ20 వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది పాక్‌.న్యూజిలాండ్‌ విధించిన 135 పరుగుల టార్గెట్‌ను 5వికెట్ల ఉండగానే ఛేజ్‌ చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అయితే పాక్‌ ఫామ్‌కు కివీస్‌ నిర్దేశించిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. కానీ, పిచ్‌ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో కివీస్‌ ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. చేజింగ్‌లో పాక్‌ ఆదిలో కాస్త తడబడినా… తర్వాత పుంజుకుంది. 18.4 ఓవర్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోది రెండు వికెట్లు బౌల్ట్‌,సాంటర్న్‌,సౌథీ, తలో వికెట్‌ తీశారు..

ఓపెనర్‌ రిజ్వాన్‌ (33; 34 బంతుల్లో 5×4) మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడగా.. మధ్యలో చకచకా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును అసిఫ్‌ అలీ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 1×4, 3×6), షోయబ్‌ మాలిక్‌ (26 నాటౌట్‌; 20 బంతుల్లో 2×4, 1×6) గట్టెక్కించారు. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి (2/28) రాణించాడు. అంతకుముందు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హారిస్‌ రవూఫ్‌ (4/22) ధాటికి కివీస్‌ 134/8కు పరిమితమైంది.

మ్యాచ్‌లో 136 పరుగుల లక్ష్యం సవాలుగా మారింది. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 5 ఓవర్లకు పాక్‌.. 28 పరుగులే చేసింది. పైగా తర్వాతి ఓవర్లో బాబర్‌ (9)ను సౌథీ బౌల్డ్‌ చేయడంతో పాక్‌కు కష్టాలు తప్పలేదు. జమాన్‌ (11), హఫీజ్‌ (11) స్పిన్నర్ల బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్‌ బాది కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని చూసినా.. ఆ వెంటనే వికెట్లిచ్చేశారు. హఫీజ్‌ క్యాచ్‌ను కాన్వే లాంగాఫ్‌లో కళ్లు చెదిరే రీతిలో డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. 12వ ఓవర్లో రిజ్వాన్‌ను సోధి వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పాక్‌ను గట్టి దెబ్బ తీశాడు. అప్పటికి స్కోరు 69 పరుగులే. ఇమాద్‌ వసీమ్‌ (11) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. చివరి 4 ఓవర్లలో 37 పరుగులతో సమీకరణం కొంచెం కష్టంగానే కనిపించింది. కానీ బ్యాటింగ్‌లో మాదిరే బౌలింగ్‌లోనూ కివీస్‌ చివరి ఓవర్లలో తడబడింది. 17వ ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో స్లో బంతులకు అసిఫ్‌ అలీ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో పాక్‌ పని తేలికైపోయింది. మాలిక్‌ సైతం సమయోచితంగా షాట్లు ఆడాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌల్ట్‌ బంతిని సిక్సర్‌గా మలిచిన అసిఫ్‌ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు..