పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి… చైనా జాతీయులు ఆరుగురు మృతి …!

పాకిస్థాన్(Pakistan)లో ఆత్మాహుతి దాడి(suicide attack) జరిగింది.
ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa Province) లో చోటు చేసుకున్న ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు..మరణించినవారిలో ఐదుగురు చైనా(Chinese)జాతీయులు ఉన్నారు..ఇస్లామాబాద్ నుంచి దసు ప్రాంతంలోని తమ క్యాంపునకు చైనా ఇంజినీర్ల బృందం వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లోని బిషమ్ తెహ్సిల్ వద్ద చైనా ఇంజినీర్ల కాన్వాయ్ వెళుతుండగా, ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దాడికి పాల్పడ్డాడు..ఈ దాడిలో ఐదుగురు చైనా ఇంజినీర్లు, వారి వాహనం డ్రైవర్ గా ఉన్న ఓ పాకిస్థానీ జాతీయుడు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి చైనా ఇంజినీర్ల వాహనం రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న ఓ గోతిలోకి ఎగిరిపడిందని, అనంతరం మంటల్లో చిక్కుకుందని పోలీసులు వివరించారు..
ఈ ఆత్మాహుతి దాడి ఘటనను పాకిస్థాన్ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. చైనా పౌరులు మృతి చెందడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వ్యతిరేక శక్తులు ఎన్నటికీ పాకిస్థాన్-చైనా స్నేహాన్ని దెబ్బతీయలేవని జర్దారీ ఉద్ఘాటించారు.