పాకిస్తాన్‌పై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్…!

ఆసియా దేశాల్లో యుద్ధ మేఘాలు అలముకుంటోన్నాయి. మధ్య తూర్పు దేశాలకు పరిమితమైన ఈ యుద్ధ తీవ్రత క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే యెమెన్‌పై దాడికి దిగింది అమెరికా..హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

ఇరాక్‌లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించింది ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఎర్బిల్‌లోని అమెరికన్ కాన్సులేట్.. గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.

ఇరాక్, సిరియాల్లో మకాం వేసిన రివాల్యూషనరీ గార్డ్స్ శిబిరాలపై రెండు రోజుల కిందటే వైమానిక దాడులను చేపట్టింది ఇరాన్. ఇప్పుడు తాజాగా తన దిశను మార్చింది. పాకిస్తాన్‌పై అస్త్రాలను ఎక్కుపెట్టింది. పాకిస్తాన్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది. దీన్ని సర్జికల్ స్ట్రైక్స్‌గా పేర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు..

పాకిస్తాన్ భూభాగంపై గల బలూచిస్తాన్ ప్రాంతంలోని సిస్టాన్‌పై ప్రధానంగా ఇరాన్ దాడులు సాగాయి. ఆఫ్ఘనిస్తాన్- ఇరాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుందీ టౌన్. జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు కేంద్రబిందువుగా చెబుతుంటారు. సున్ని మిలిటెంట్ల ఆధీనంలో ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి అనుగుణంగా ఈ ఉగ్రవాద సంస్థ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. డ్రోన్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. మిస్సైళ్లను సంధించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనతో సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా- ఈ దాడుల పట్ల పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ భూభాగంపై దాడులకు పాల్పడటం సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సిస్టాన్ ప్రాంతం తమ భూభాగంపై లేదని పేర్కొంది. ఈ విషయంపై ఇప్పటికే ఇరాన్‌కు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది..