పరిటాల శ్రీరామ్‌కి షాకిచ్చిన చంద్రబాబు..!

నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఎక్కువుగా ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్ని పార్టీల నాయకుల్లో కనిపించింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ అధిష్టానం తమకు కేటాయించిన 10 మంది ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించింది.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..

ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వర రావు

విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు

అరకు లోయ – పంగి రాజారావు

అనపర్తి – ఎం.శివ కృష్ణం రాజు

కైకలూరు – కామినేని శ్రీనివాసరావు

విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి

బద్వేల్ – బొజ్జా రోశన్న

జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి

ఆదోని – పార్థసారథి

ధర్మవరం – వై.సత్యకుమార్

ఇదిలా ఉంటే ధర్మవరం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పరిటాల శ్రీరామ్‌కు మొండిచేయి ఎదురైంది. పరిటాల శ్రీరామ్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరంలో టీడీపీని నడిపించే నాయకులు లేకపోతే పరిటాల శ్రీరామ్‌ అక్కడకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారనే విషయాన్ని పరిటాల శ్రీరామ్‌ అనుచరులు పార్టీ అధినేతకు గుర్తు చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్‌ వచ్చిన తరువాతే ధర్మవరంలో పార్టీ పరిస్థితులు మారాయని..పార్టీని గాడిలో పెట్టడమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఎన్నో పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేశారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు..తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి టికెట్ వేరే వ్యక్తికి కేటాయించడాన్ని పరిటాల శ్రీరామ్‌ అనుచరులు తప్పుపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్‌కు ఈ ఎన్నికలు చాలా కీలకం. పరిటాల రవి తనయుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడితో ఆగిపోయినట్టే అని నియోజవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు..ఇదిలా ఉంటే ఇక్కడ టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, బీజేపీ నుంచి వరదాపురం సూరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్‌పై ఇరువురు నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రధాని మోదీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బీజేపీ జాతీయ సెక్రటరీ సత్యకుమార్‌కే ధర్మవరం టికెట్ దక్కింది. సత్యకుమార్ 34 ఏళ్ల నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. మోదీ, అమిత్ షా సన్నిహితుడిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు..